జగన్ గారూ.. చురుగ్గా స్పందించాల్సిందే!

అమ్మాయిల మానరక్షణ కోసం, దుర్మార్గుల వెన్నులో వణుకు పుట్టించడం కోసం ‘దిశ’ వంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మరి ఆయన పార్టీకి చెందిన వారే.. అకృత్యాలకు పాల్పడితే ఏం చేయాలి? పార్టీ ఎలా స్పందించాలి? ఆరోపణలు వచ్చిన తక్షణమే స్పందించి, చర్యలు తీసుకుంటే తప్ప.. ఇతరత్రా దక్కుతున్న మంచిపేరును ప్రభుత్వం నిలబెట్టుకోవడం కష్టం.

- Advertisement -

విశాఖ జిల్లా సీలేరులో ఒక దుర్మార్గం జరిగింది. ఆ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చిన్న నాయకుడు. గ్రామస్థాయిలో గతంలో అధ్యక్ష పదవిని కూడా వెలగబెట్టిన వాడు.

ఒక దివ్యాంగురాలైన అభాగ్యురాలు.. పెళ్లయి భర్త వదిలేయడంతో అమ్మవారింట్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో తల్లికి సుస్తీ చేయడం వల్ల.. ఆమె ఆస్పత్రికి వెళ్లింది. ఆరాత్రి ఇంట్లో ఉన్న దివ్యాంగురాలిపై అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన నాళ్ల వెంకటేశ్వరరావు అనే వ్యక్తి చున్నీతో నోటిని కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించాడు. మర్రోజు తల్లి ఇంటికి వచ్చిన తర్వాత సంగతి తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మహిళలకోసం దిశ వంటి మంచి చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఇలాంటి సంఘటన వెలుగులోకి రాగానే.. ఎందుకు ఉపేక్ష భావం వహించారో అర్థం కాని సంగతి. ఇలాంటి దురాగతానికి పాల్పడిన వ్యక్తి తమ పార్టీ వాడు అని తెలియగానే తక్షణం పార్టీనుంచి సస్పెండ్ చేసేసి ఉండాల్సింది. ఎందుకు ఆలస్యం చేశారో గానీ.. ప్రతిపక్షాలు ఈ అంశాన్ని బాగానే అందిపుచ్చుకున్నాయి. నాళ్ల వెంకటరావుకు పార్టీలో పెద్దల అండ ఉన్నదని, అతడిని కాపాడేందుకు పార్టీలో పెద్దలు ప్రయత్నిస్తున్నారని రకరకాల ఆరోపణలు గుప్పిస్తున్నాయి.

ముఖ్యమంత్రికి మహిళల రక్షణ విషయంలో ఎంతటి నిశ్చితాభిప్రాయాలు, చిత్తశుద్ధి ఉన్నాయో అందరికీ తెలిసిన సంగతే. అయితే, చిత్తశుద్ధి ఆయన ఒక్కడిలో ఉంటే సరిపోదు. అదే స్ఫూర్తి పార్టీ అందరిలోనూ ఉండాలి. కలుపుమొక్కల్లా ఎవరైనా పార్టీలో దుష్టులు ఉంటే వారిని ఏరి పారేయాలి. లేకపోతే కలుపు మొక్కల వల్ల పార్టీ నష్టపోతుంది. ఆ సంగతి కూడా జగన్ తెలుసుకోవాలి.

Share post:

Popular