పరువు పోయె : వెల్లంపల్లి ప్రకటనతో మరిన్ని సందేహాలు

కోర్టులనుంచి వరుస ఎదురుదెబ్బలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాల పాలకమండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి ఇంకా ఇబ్బందికరమైనవి. భారీ సంఖ్యలో టీటీడీకి ప్రత్యేక ఆహ్వానితుల్ని నియమిస్తూ జగన్ సర్కారు జీవో ఇవ్వగా, ఆ జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేసింది.

ఇదంతా ఒక ఎత్తు. కోర్టుల్లో ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగలడం పెద్ద విషయమేమీ కాదు. కొత్త సంగతి కూడా కాదు. అయితే ఇది ఇతర ఎదురుదెబ్బల్లాంటిది కాదు. టీటీడీ బోర్డు విషయంలో అదనంగా వచ్చే పరువు నష్టం కూడా ఉంది. ఎందుకంటే.. 24 మంది సభ్యులతో జంబో బోర్డు తయారుచేసినప్పుడు ఎదురైన విమర్శలు చాలవన్నట్టుగా.. ఏకంగా యాభై మంది ప్రత్యేక ఆహ్వానితులతో ప్రభుత్వం.. అత్యంత జంబో కమిటీని నియమించింది.

అదొక్కటే కాదు.. సదరు ప్రత్యేక ఆహ్వానితుల నియామకం అన్నదే.. పైరవీలకు పెద్దపీట వేస్తూ సాగిన వ్యవహారంలాగా అనేక విమర్శలు వెల్లువెత్తాయి. తాను అసలు సిఫారసు లెటరే ఇవ్వలేదని, తన ఉత్తరం వల్ల పదవి ఇచ్చినట్టుగా జరుగుతున్న ప్రచారంపై విచారణ జరిపించాలని.. ఏకంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సీఎం జగన్ కు లేఖ రాయడంతో మరింత పరువు పోయింది.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. హైకోర్టు నుంచి జీవో సస్పెన్షన్ ఉత్తర్వులు వచ్చిన తర్వాత.. సంబంధిత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించిన తీరు కూడా.. ప్రభుత్వానికి మరింత పరువు నష్టం చేసేలా ఉంది. కేవలం సాంకేతిక అంశాల కారణంగా మాత్రమే జీవోను హైకోర్టు సస్పెండ్ చేసి ఉంటుందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిజానికి కారణం- సాంకేతిక అంశాలు కాదనే సంగతి ఆయనకు కూడా తెలుసు. ప్రభుత్వం న్యాయవాది చెప్పిన వాదనను కోర్టు ఆలకించలేదు.

అయితే దీనితో పాటూ.. ఈ మధ్యంతర ఉత్తర్వులపై అప్పీల్ కు వెళ్లాలా లేదా.. ఆదేశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం అని మంత్రి వెలంపల్లి అన్నారు. ఈ మాట గమనించినప్పుడు.. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సజావైనదే అనే అభిప్రాయం ఆయనకే ఉన్నట్టు కనిపించడం లేదు.

ఎందుకంటే.. కోర్టునుంచి ఎలాంటి ప్రతికూల ఆదేశాలు వచ్చినా సరే.. ప్రభుత్వానికి తమ ఆదేశాల మీద కనీసం తమకు విశ్వాసం ఉంటే.. ఖచ్చితంగా అప్పీల్ కు వెళతాం అనే మాట రావాలి. అలా కాకుండా.. అప్పీల్ కు వెళ్లాలో వద్దో ఆలోచిస్తాం అంటే.. ఆ జీవో సస్పెండ్ అయినా సరే.. పెద్ద పోయేదేం లేదులే అని ఒప్పుకోవడం లాగానే ఉంటుంది. పరోక్షంగా తమ ప్రభుత్వ నిర్ణయం, ఉత్తరువు తప్పు అని అంగీకరిస్తున్నట్టే. అందుకే వెలంపల్లి మాటలతో ప్రభుత్వం పరువు ఇంకా పోతోందని పలువురు అనుకుంటున్నారు.