ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మరో హీరో..!

చిత్తూరు జిల్లా.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా.. అందులోనూ చంద్రగిరి.. చంద్రబాబుకు బలమైన నియోజకవర్గం.. 1983 వరకు ఆయనను రాజకీయంగా నిలబెట్టిన నియోజకవర్గం అదే.. అయితే ఎన్టీయార్ హవాలో అప్పుడు చంద్రబాబు చంద్రబాబు ఓటమిచవిచూశాడు. దీంతో కుప్పం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యాడు. అయినా ఆ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీ ప్రేమను చంపుకోలేదు. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు 1994లో అక్కడ టీడీపీ తరఫున విజయం సాధించాడు. అయితే 1999లో మాత్రం కాంగ్రెస్ చేతికి ఇచ్చేశాడు. ఇదీ ఆ నియోజకవర్గం గురించి క్లుప్తంగా.. ఇపుడు అదే చంద్రగిరి మళ్లీ వార్తల్లో నిలిచింది.

నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ వచ్చే ఎన్నికల్లో (2024) చంద్రగిరి నుంచి పోటీ చేయనున్నారని సమాచారం. తెలుగుదేశం పార్టీ కూడా రోహిత్ ను పోటీచేయించాలని ప్లాన్ వేస్తోందట. అక్కడ టీడీపీ జెండా ఎగురవేసేందుకు చంద్రబాబు అండ్ కో పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా చంద్రగిరిలో విజయం సాధించిన పాతికేళ్ల క్రితం పోగొట్టుకున్న ప్రాభవాన్ని తిరిగి సంపాదించాలని నారావారి మదిలో మెదిలో ఆలోచన అని తెలిసింది. అయితే నారా రోహిత్ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లే తెలిసింది. ఇటీవల టీడీపీ నేత దేవినేని ఉమ అరెస్ట్ అయినపుడు ఆయనను నారా రోహిత్ కలిశాడు. ఆ సమయంలో తన మనసులో మాట చెప్పినట్లు సమాచారం. దీంతో దేవినేని చంద్రబాబుతో చర్చించి రోహిత్ లైన్ క్లియర్ చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా చంద్రగిరిలో ప్రస్తుతం వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికల్లో ఆయనను ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థి కావాలి. ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీలో అటువంటి నాయకులెవరూ లేరు. రోహిత్ ను బరిలోకి దింపితే చంద్రబాబు ఫ్యామిలీ నుంచి వచ్చినట్లు ఉంటుంది.. కేడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది.. వైసీపీలో కూడా కాస్త ఆందోళన ఉంటుంది.. ఇవన్నీ టీడీపీ అధినేత మదిలో ఆలోచనలట.. అన్నీ అనుకున్నట్టు జరిగితే నారా రోహిత్ ఎన్నికల్లో పోటీచేయడం ఖాయం.