‘ఈనాడు శ్రీధర్’ సొంత కుంపటి..!

September 13, 2021 at 1:14 pm

ఈనాడు శ్రీధర్ గానే ప్రపంచానికి అంతటికీ నలభయ్యేళ్లుగా పరిచయం ఉన్న కార్టూనిస్టు శ్రీధర్, తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత.. సొంత కుంపటి పెట్టుకున్నారు. ఒక యూట్యూబ్ ఛానెల్ ద్వారా రాజకీయ విశ్లేషకుడిగా అవతారం ఎత్తే ప్రయత్నంలో ఉన్నారు. ఈ యూట్యూబ్ ఛానెల్ శ్రీధర్ అన్నయ్య పిఎస్ఎం రావు అనే ఆర్థికరంగ విశ్లేషకుడికే చెందినది కావడం గమనార్హం. ఆ ఛానెల్ ద్వారా సొంత వ్యాపారం మీదనే ఇప్పుడు శ్రీధర్ దృష్టి నిలుపుతున్నట్లుగా అర్థమవుతోంది.

రెండు తెలుగురాష్ట్రాల్లోనూ కార్టూనిస్టుగా శ్రీధర్ కు చాలా గొప్ప పాపులారిటీ ఉంది. ఈనాడు పత్రిక తెలిసిన ప్రతి ఒక్కడికీ రామోజీరావు పేరు తెలిసినట్టే శ్రీధర్ పేరు కూడా తెలుసు అంటే అతిశయోక్తి కాదు. ఈనాడు పత్రిక స్థాపించిన తర్వాత.. ఎనిమిదేళ్ల నుంచి శ్రీధర్ ఆ పత్రికలో పొలిటికల్ కార్టూన్లు గీస్తున్నారు. ఒకే సంస్థలో నలభయ్యేళ్ల సుదీర్ఘ ప్రస్థానం ఆయనది. అయితే ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసేశారు.

శ్రీధర్ మరో సంస్థకు కార్టూనిస్టుగానే వెళ్లబోతున్నాడని, ఇంగ్లిషు పత్రికలలో కార్టూనిస్టుగా చేరుతాడని రకరకాల పుకార్లు వచ్చాయి. అయితే ఇలాంటి పుకార్లన్నీ చూసి తాను నవ్వుకున్నానని శ్రీధర్ స్వయంగా విడుదల చేసిన ఒక వీడియోలో చెప్పుకున్నారు. కార్టూనిస్టుగా రెండో దశ ప్రస్థానం ఎలా ఉంటుందో క్లారిటీ ఇవ్వలేదుగానీ.. ప్రస్తుతానికి తానొక రాజకీయ విశ్లేషకుడిగా యూట్యూబ్ ఛానెల్ ద్వారా.. ప్రతివారం అభిప్రాయాలు చెబుతుంటానని ఆయన ప్రకటించారు. మచ్చుకు కొన్ని ప్రస్తుత అంశాల మీద.. ఆయన తన అభిప్రాయాల్ని తొలివీడియోలోనే చెప్పారు కూడా.

శ్రీధర్ అంటే కార్టూనిస్టు గనుక.. ఆయనకు బొమ్మలు గీయడం మాత్రమే వచ్చు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కార్టూన్ ఎలా ఉండాలో అయిడియా కూడా మరెవ్వరో చెబుతారని, ఆ ఐడియాను ఈయన గీతల్లోకి మారుస్తారని అనుకునే వారు కూడా ఉంటారు. ఆయనను అందరూ కార్టూనిస్టు అనుకుంటారే తప్ప.. ఈనాడులో ఆయన డిజిగ్నేషన్ కార్టూన్ ఎడిటర్ అనే సంగతి కూడా చాలా మందికి తెలియదు. అయితే శ్రీధర్ కు కార్టూన్లను మించిన రాజకీయ అవగాహన బోలెడంత ఉందనే సంగతి కొద్ది మందికే తెలుసు.

అలాంటి సామర్థ్యానికి ఆయన ఇప్పుడు విశ్లేషకుడి రూపంలో పదును పెట్టుకోడానికి డిసైడ్ అయినట్లుగా కనిపిస్తోంది. యూట్యూబ్ లో రాజకీయ విశ్లేషణలను సాధికారంగా చెబుతున్న అనేక మంది ప్రముఖులు బాగా పాపులర్ అయ్యారు. శ్రీధర్ కు ఆల్రెడీ తిరుగులేని పాపులారిటీ పుష్కలంగా ఉన్నది గనుక.. ఆయన వీక్లీ ఒకసారి చేయబోయే రాజకీయ విశ్లేషణలు ప్రేక్షకుల్ని బాగానే రంజింపజేస్తాయని అనుకోవచ్చు.

‘ఈనాడు శ్రీధర్’ సొంత కుంపటి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts