ఎన్ని ‘దిశ’లు ఉన్నా.. ఈ దరిద్రం తొలగేదెలా?

దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయనంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి సర్కారు.. మహిళల రక్షణ గురించి శ్రద్ధ తీసుకుంటోంది. అన్ని రాష్ట్రప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో జగన్ సర్కారు దిశ చట్టం తీసుకువచ్చింది. కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా కేంద్రం మోకాలడ్డి దిశ ఇంకా పూర్తిస్థాయిలో చట్టం రూపం దాల్చలేదు గానీ.. దాని రూపకల్పన వెనుక ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమాత్రం శంకించలేనిది. ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో గట్టి చట్టాల కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆ స్ఫూర్తి కిందిస్థాయి పోలీసు సిబ్బంది వరకు వెళ్లడం లేదనేది తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన దుర్ఘటన చెబుతున్న వాస్తవం.

పెళ్లికి హాజరై తిరిగి ఇంటికి వెళుతున్న దంపతుల్ని అటకాయించి.. కొట్టి భర్తను కట్టేసి, భార్యను సామూహికంగా అత్యాచారం చేసిన ఘటన అత్యంత హేయమైనది. ఇది సాక్షాత్తూ ప్రస్తుతానికి రాజధాని ఉంటున్న గుంటూరు జిల్లాలోనే జరిగింది. ఈ ఘోరం జరిగింది సరే.. ఆ తర్వాతి పరిణామాలు, పోలీసుల స్పందన గురించి వినిపిస్తున్న విషయాలే అత్యంత హేయమైనవిగా కనిపిస్తున్నాయి.

దిశ కింద కేసులు నమోదు చేసే వెసులుబాటు ఏపీలో ఉంది. ఏప్రాంతంలో అన్యాయం జరిగినా సరే.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉంది. అయితే.. ఇంతఘోరం జరిగిన తర్వాత.. పోలీసులు తమ పరిధికి చెందిన వ్యవహారం కాదంటూ కేసు నమోదు చేయడంలో కాలయాపన చేశారనే వార్తలు నిర్ఘాంత పరుస్తున్నాయి. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన తర్వాత.. పోలీసులు సకాలంలోనే స్పందించారని ఒక స్టేట్ మెంట్ ఇచ్చి పోలీసులు కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

అలసత్వం అనేది అన్నింటికంటె ప్రమాదకరమైన విషయం. పైగా ప్రజల మానప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన పోలీసుల్లోనే అలసత్వం ఉంటే.. ఇక ప్రజలకు పూచీ వహించేదెవరు? ప్రభుత్వాలు కేవలం చట్టాలు మాత్రమే చేయగలవు. అవి ఎంత మేరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి? వాటి ఫలాలు ప్రజలకు ఏమేరకు అందుతున్నాయి? అనేది వాటి అమలును పర్యవేక్షించాల్సిన కార్యనిర్వాహక వ్యవస్థ మీదనే అధికార్ల మీదనే ఆధారపడి ఉంటుంది. అలాగని ప్రభుత్వం చేతులు దులిపేసుకోవడానికి కూడా వీల్లేదు.

అధికారుల్ని సరైన దిశలో నడిపించే పని మళ్లీ రాజకీయ ప్రభుత్వానిదే అవుతుంది. ఏ రకంగా చూసినా సరే.. అధికారుల మీద రాజకీయ నాయకులు కర్రపెత్తనం చేస్తూ.. తమ చెప్పుచేతల్లో పనిచేయించుకునేలా అజమాయిషీ చేయడం కొత్త సంగతి కాదు. అయితే కేవలం తమ తమ సొంత పనుల కోసం మాత్రమే కాకుండా.. ప్రజల పట్ల కూడా వారు చిత్తశుద్ధితో వ్యవహరించేలా నాయకులు కొంత అజమాయిషీ చేస్తే.. వ్యవస్థలో ఇలాంటి లోపాలు మళ్లీ మళ్లీ కనిపించవు. ప్రజలకు కనిపించే రీతిలో విఫలమయ్యేది అధికారులే అయినప్పటికీ.. అంతిమంగా పరువు పోయేది మాత్రం అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకే అనే సంగతి వారు తెలుసుకోవాలి.