పాపం చంద్రబాబు.. ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో..?

September 3, 2021 at 10:33 am

‘అధికారాంతమునందు చూడవలె కదా.. ఆ అయ్య సౌభాగ్యముల్’ అన్నారు పెద్దలు. అధికారం ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ తిరుగుతూ మన భజన చేస్తూ కీర్తిస్తూ గడుపుతూ ఉంటారు. కానీ, అధికారం దిగిపోయిన తర్వాత సంగతి ఏమిటి? అధికారం లేకపోయినా కూడా ఎవరికి విలువ దక్కుతుందో వారు మాత్రమే నిజమైన నాయకులు అనుకోవాలి. ఇప్పుడు చంద్రబాబునాయుడు అధికారంలో లేరు. దానికి తగ్గట్టుగానే పార్టీలో కూడా ఆయన ప్రభ పలచబడిపోయింది. పట్టించుకునే వారు తక్కువ. ఖాతరు చేసే వారు, భయపడేవారు ఇంకా తక్కువ. అలాంటిది.. అధికారంలో ఉన్నప్పుడు కూడా లెక్కచేయని నాయకుడు ఇప్పుడు ఇంకెంత ధిక్కారంగా ఉంటాడో చెప్పేదేముంది. అందుకే చంద్రబాబుకునాయుడుకు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి రూపంలో చెప్పలేనన్ని కష్టాలు వచ్చిపడ్డాయి.

గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలుగుదేశంలో ఫైర్ బ్రాండ్ నాయకుడు కింద లెక్క. ఆయన చంద్రబాబు జమానా మొదలైన కాలం నాటి నాయకుడు కాదు. చంద్రబాబునాయుడు ప్రాపకం వలన గెలుస్తున్న, మనుగడ సాగిస్తున్న నాయకుడు కూడా కాదు. అందువలన చంద్రబాబు అంటే ఆయనకు ఏమాత్రం లెక్క లేదు. ఎన్టీఆర్ కాలం నాటినుంచి పార్టీలో కీలక నాయకుడుగా ఉన్న బుచ్చయ్య చౌదరి చంద్రబాబు హయాంలోనూ ఆయనను ధిక్కరిస్తూ అనేక మార్లు మాట్లాడుతుండేవారు.

అలాంటి బుచ్చయ్య చౌదరి పార్టీ అధికారంలో లేని ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటె తీవ్రంగా ధిక్కార స్వరం వినిపించారు. చంద్రబాబునాయుడు పుత్ర ప్రేమ వలనే పార్టీ నాశనమైపోతోందనే అభిప్రాయాన్ని గతంలో కూడా పలుమార్లు బహిరంగంగానే వినిపించిన బుచ్చయ్య.. ఇటీవల పార్టీ నియామకాల విషయంలో తనను సంప్రదించకపోవడంపై అలిగి.. పార్టీకే రాజీనామా చేసేస్తానని ప్రకటించేశారు. ఆల్రెడీ రాజకీయ రిటైర్మెంట్ వయసుకు దగ్గర్లో ఉన్న బుచ్చయ్య తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో మిగిలిన అతికొద్ది మంది ఎమ్మెల్యేల్లో ఒకడు. అలా ఉన్న ఎమ్మెల్యే కూడా పార్టీనుంచి జారిపోతే.. పార్టీ ఏమైపోవాలి. అందుకే చంద్రబాబుకు భయం పట్టుకుంది.

అప్పట్లో లక్ష్మీపార్వతి వర్గంగా పేరుపడిన నాయకుడు గనుక.. ఆ తర్వాతి కాలంలో పార్టీ తరఫున గెలుస్తున్న సీనియర్ అయినా ఏ మాత్రం ప్రయారిటీ ఇవ్వకుండా బుచ్చయ్య కెరీర్ ను తొక్కేసిన చంద్రబాబు.. తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీసుకు పిలిపించి బతిమాలి బుజ్జగించారు. పార్టీని వీడిపోవద్దని కోరారు. బుచ్చయ్య కూడా కాస్త మెత్త పడ్డారు. పార్టీకి రాజీనామా ఆలోచన ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరు వైసీపీలోకి పోయారు.. మిగిలిన వారిలో కొందరు అసంతృప్తితో పార్టీని వీడిపోతే.. ఇక ఏపీ తెలుగుదేశం పరిస్థితి కూడా తెలంగాణ తెలుగుదేశం లాగానే తయారవుతుందని భయపడ్డారో ఏమోగానీ చంద్రబాబు.. చాలా మెట్లు దిగి.. గతంలో తాను పక్కన పెట్టిన వారిని కూడా బతిమాలే పరిస్థితికి వచ్చారు. అయ్యో పాపం!

పాపం చంద్రబాబు.. ఎన్నెన్ని కష్టాలు వచ్చాయో..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts