స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం కేసీఆరే..

ఎవరీకి పెద్దగా తెలియని గెల్లు శ్రీనివాస యాదవ్ పేరుకు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.. ముందు ఆయన కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పాలి.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస యాదవ్ ను ప్రకటించడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానాన్ని ఎలా అయినా గెలుచుకోవాలని, అది మా సీటని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అయితే అక్కడ నేనే గెలిచాను.. అది ఈటల ప్లేస్.. అంటూ ఈటల రాజేందర్ కూడా నువ్వా..నేనా అన్నట్లు బరిలో నిలిచారు. పార్టీలో సీఎంను చాలెంజ్ చేసి బయటకు వెళ్లిన ఈటలపై విజయం సాధిస్తే పార్టీలో ఇక తిరుగుండదని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే హుజూరాబాద్ లో గులాబీ జెండా ఎగురవేసేందుకు సర్వశక్తులు వడ్డుతున్నారు.

కారు పార్టీలో అభ్యర్థి ఎవరైనా దర్శకత్వం మొత్తం అధినేతదే.. ఏం చేయాలి.. ఎలా చేయాలి.. ప్రచారం ఏ విధంగా ఉండాలి.. ఎవరేం మాట్లాడాలి.. ఎక్కడెక్కడ ఓటు బ్యాంకు తక్కువగా ఉంది.. ఎవరు అసంత్రుప్తిలో ఉన్నారు.. వారిని ఎలా బుజ్జగించాలి.. లాంటి విషయాలు ఎప్పటికప్పుడు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే పలువురు మంత్రులు హుజూరాబాద్ లో ప్రచారం కూడా నిర్వహించారు. ఇపుడు పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలంటూ ప్రచారం చేస్తూ స్థానిక నాయకులతో సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే ఈనెల 16న దళితబంధు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేలా.. స్వయంగా సీఎం పాల్గొనేలా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కార్యక్రమం పేరుతో పార్టీ కార్యక్రమం నిర్వహించనున్నారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా గెలుపే లక్ష్యంగా గులాబీ బాస్ పావులు కదుపుతున్నారనేది జగమెరిగిన సత్యం.