ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో?

వైజాగ్ స్టీల్ ప్లాంట్(వీఎస్పీ) ప్రైవేటీకరణ అవుతుందో, లేదో పక్కన పెడితే ప్రైవేటు విషయం కేంద్రం ప్రకటించినప్పటి నుంచీ ఏపీలో ఈ విషయం చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తీసుకొని ప్రజల్లో సానుభూతిని సంపాదించాలని భావిస్తున్నాయి. అందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే అందరికంటే ఓ అడుగు ముందుకేసిన వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వీఎస్పీ పరిరక్షణకు మద్దతుగా రాజీనామా చేసినా ఆ తరువాత స్పీకర్ ఫార్మాట్ లోనే మరోసారి రిజిగ్నేషన్ లెటర్ ను స్పీకర్ తమ్మినేనికి పంపించారు. ఇది జరిగి ఇప్పటికి ఆరు నెలలైంది. గతంలో ఓసారి స్పీకర్ ను కలిసి రాజీనామా ఆమోదించాలని కోరారు. ఇక అంతే.. ఆయన రాజీనామా ఆమోదించలేదు.. ఆయన కూడా కనిపించడం లేదు.

ముఖ్యవిషయమేమంటే వీఎస్పీకి మద్దతుగా నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే దానికోసం రాజీనామా చేసిన ఈయన ఎక్కడున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ నాయకులతో కూడా టచ్ లో లేరు. పలువురు నాయకులు, కార్మికులు ఈ వ్యవహారంపై ఢిల్లీలో వివిధ పార్టీల నాయకులను కలిసి మద్దతు కోరుతుంటే ఈయన మాత్రం ఎవరికీ అందుబాటులో లేకుండాపోయారు. ఉద్యమాన్ని తన రాజీనామాతో ఓ రేంజ్ లోకి తీసుకెళ్లిన గంటా.. ఇపుడెందుకు సైలెంట్ గా ఉన్నారు? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏమో.. రాజకీయ నాయకులకు సమాజ ప్రయోజనాలకన్నా..స్వప్రయోజనాలే ముఖ్యమని పలు సందర్భాల్లో రుజువైంది. ఇప్పటికే ఆయన టీడీపీ, కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించారు. ఇంకా వైసీపీలో చేరలేదు. ప్రస్తుతానికి ఆయన చేరే పరిస్థితి లేదు. బీజేపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారేమో? అని పరిశీలకులు భావిస్తున్నారు. రాజకీయాలు కదా.. ఇందులో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు.. మరి.