లీడర్స్ ఫ్రం టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ..కమలంలో మరో గ్రూప్‌..

తెలంగాణ బీజేపీలో మరో కొత్త గ్రూపు క్రియేట్‌ అయ్యింది. ఇప్పటికే రెండు, మూడు గ్రూపులు రాజకీయాలు నడిపిస్తుండటంతో సరికొత్తగా మరొకటి తయారైందని తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి వచ్చిన వారితో ఈ గ్రూపు ఏర్పాటైనట్లు సమాచారం. టీ.బీజేపీలో గ్రూపు రాజకీయాలతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. బండి సంజయ్‌ గత సంవత్సరం పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తరువాత గ్రూపులో పెరిగిపోయాయి. అయితే బీజేపీలో వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలకు బండికే మద్దతు తెలిపారు.

అయితే బీసీ నాయకుడైన డాక్టర్‌ కె. లక్ష్మణ్ మాత్రం బండి వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. బండి సంజయ్‌, లక్ష్మణ్‌ మధ్య దూరం ఇటీవల కాలంలో బాగా పెరిగిందని, పార్టీ కార్యక్రమాల్లో కూడా వారు పెద్దగా కలిసి పనిచేయడం లేదని రాజకీయాలు దగ్గరగా పరిశీలిస్తున్న వారు చెబుతున్నారు. అయితే బండి సంజయ్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించకముందు మాత్రం పార్టీలో అగ్రవర్ణ నాయకులదే పెత్తనమని కార్యకర్తలు కూడా అనుకుంటున్నారు. రెడ్డి వర్గానికి చెందిన కిషన్‌ రెడ్డి, బ్రాహ్మణ వర్గానికి చెందిన కె. రామచంద్రరావు లాంటి వారు పార్టీలో చక్రం తిప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీలో ఇపుడు సరికొత్త గ్రూపు పుట్టుకొచ్చినట్లు తెలిసింది. పార్టీ సీనియర్‌ నాయకురాలు, కాంగ్రెస్‌ నుంచి వచ్చి కమలంలో చేరిన డీకే అరుణ ఆధ్వర్యంలో కొందరు గ్రూపు పాలిటిక్స్‌ చేస్తున్నారని సమాచారం. టీఆర్‌ఎస, కాం‍గ్రెస్‌ పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఈ గ్రూపలో యాక్టివ్‌ గా ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డిలను వ్యతిరేకించే వారు అరుణ గ్రూపులో చేరుతున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే పార్టీలో ఇన్ని గ్రూపు రాజకీయాలు జరుగుతుంటే అధిష్టానం మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి 2023 నాటికి బీజేపీ నేతలు ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.