చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి, ఆయన నమ్మినబంటు, మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావుకు మధ్య రాజకీయంగా సైలెంట్ వార్ నడుస్తోందా? కరణం బలరాం తనపై ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని.. పాలేటి భావిస్తున్నారా? ఈ క్రమంలోనే ఆయన కరణం వైఖరిపై గుస్సాగా ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు చీరాల రాజకీయ ప్రముఖులు. ఇక, తాజాగా మారిన రాజకీయ పరిణామాలు కూడా ఈ వార్ నిజమేనని ధ్రువీకరిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు.. కరణం బలరాంతో కలిసి.. వైసీపీగూటికి చేరారు.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పాలేటి.. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయనను నమ్ముకున్న నాయకులు కూడా ఉన్నారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ, ప్రస్తుతం జరుగుతున్న పరిషత్ ఎన్నికల్లోనూ తన వారు.. పోటీకి దిగారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో పాలేటి రామారావు కౌన్సిలర్ల టిక్కెట్ల వరకు తన వర్గీయులకు అధికంగా తెచ్చుకున్నారు. అయితే, మున్సిపల్ చైర్మన్ ను మాత్రం తన మనిషిని చేసుకోలేకపోయారు. ఈ విషయంలో పాలేటి సూచనలను, ఆకాంక్షలను పట్టించుకోని కరణం.. తన వర్గానికి చెందిన జ౦జన౦ శ్రీనివాసరావును మున్సిపల్ చైర్మన్ చెయ్యడం.. పాలేటికి షాక్ ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది.
అప్పటినుండి పాలేటి అన్యమనస్కంగా ఉన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో గానీ.. ఆ తర్వాత జరిగిన ఏ కార్యక్రమంలో గానీ పాలేటి పాల్గొనలేదు. ఈలోపు జడ్పీటీసీ ఎన్నికలు వచ్చాయి. గత ఏడాది నామినేషన్ల దాఖలు చేసిన అభ్యర్థుల తుదిజాబితా వెలువడ్డాక ఈ ఎన్నికలు వాయిదా పడటం తెలిసిందే. అప్పట్లో టీడీపీలోనే ఉన్న బలరాం వర్గీయులు బిట్రా సుజాత చీరాల జడ్పీటీసీ గానూ, బట్టా అనంతలక్ష్మి వేటపాలెం జడ్పీటీసీగాను టీడీపీ బీ ఫారాలు ఇచ్చింది. ఆ తర్వాత బలరాం, పాలేటి తదితరులంతా వైసీపీ గూటికి చేరారు. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలను టీడీపీ హిష్కరించడం తెలిసిందే.
అయితే, పాలేటి రామారావు చీరాల, వేటపాలెం జడ్పీటీసీలుగా నామినేషన్లు వేసిన టీడీపీ అభ్యర్థులను పోటీలో కొనసాగాలని సూచించారు. పోటీ చేస్తే తాను గెలిపించుకుంటానని వారికి హామీ కూడా ఇచ్చారు. అయితే పాలేటి ప్రతిపాదనకు బలరాం ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తాను వైసీపీలో ఉన్నందున తన మనుషులెవరూ పార్టీ అధికారిక అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేయడాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని బలరాం తేల్చి వేయడమే కాకుండా ఆ ఇద్దరు అభ్యర్థులను పోటీ చేయవద్దంటూ తనదైన శైలిలో హెచ్చరించారట.
దీంతో పాలేటి సూచనలను పక్కన పెట్టిన ఆ ఇద్దరు అభ్యర్థులు సైలెంట్ అయ్యారు. ఈ పరిణామంతో పాలేటి మరింతగా రగిలిపోతున్నారు. తాను కూడా గతంలో మంత్రిగా పనిచేశానని, తనకు కూడా రాజకీయాలు తెలుసునని.. కానీ. ఇప్పుడు మాత్రం కరణం తనపై ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నారని.. పాలేటి వాపోతున్నారు. ఈ క్రమంలో కరణం పక్కన ఉంటే.. తాను మరింతగా రాజకీయాలకు దూరం కావాల్సి వస్తుందని.. తన అనుచరులతో పాలేటి చెబుతున్నట్టు సమాచారం. దీంతో ఏ క్షణంలో అయినా.. ఆయన కరణానికి గుడ్ బై చెప్పి.. సొంతగా నే చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఈ టాపిక్ చీరాల రాజకీయాల్లో హాట్ హాట్‌గా సాగుతుండడం గమనార్హం.