ఏపీలో న్యూ రికార్డ్‌..నిన్నొక్క‌రోజే భారీ సంఖ్య‌లో టీకా పంపిణీ!

క‌రోనా వైర‌స్‌..ప్ర‌జ‌ల‌ను, ప్ర‌భుత్వాల‌ను ముప్ప తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. మ‌ళ్లీ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. మ‌రోవైపు ఈ క‌రోనాను అంతం చేసేందుకు జోరుగా టీకా పంపిణీ కూడా జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో వ్యాక్సినేష‌న్ విష‌యంలో న్యూ రికార్డు న‌మోదైంది.

నిన్నొక్క‌రోజే ఏపీలో ఏకంగా 6,17,182 మందికి టీకాలు వేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 68,358 మందికి టీకాలు వేసినట్టు అధికారులు తెలిపారు. కర్నూలులో అత్యల్పంగా 34,048 మందికి టీకాలు వేశారు.

ఇప్పటి వరకు రోజుకు సగటున 1.25 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ పంపిణీ జరిగ్గా, నిన్న రికార్డుస్థాయిలో టీకాలు వేశాడు. ఒక్క రోజులో ఇన్ని లక్షల టీకాలు ఇవ్వడం దేశంలోనే ఇది తొలిసారి. కాగా, ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు 9,37,049 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. మరణాల సంఖ్య 7,339కి చేరుకుంది. అలాగే ఇప్పటి వరకు 9,01,327 మంది కరోనా నుంచి కోలుకోగా.. 28,383 యాక్టివ్ కేసులు ఉన్నాయి.