ఇటీవలి కాలంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ మధ్య వార్ రసవత్తరంగా జరుగుతోంది. కొద్ది రోజుల క్రిందటి వరకు టీఆర్ఎస్, కేసీఆర్ దూకుడు ముందు తేలిపోయిన కాంగ్రెస్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాస్త జోరు పెంచింది. నిన్నటి వరకు టీఆర్ఎస్ మైండ్‌గేమ్‌కు సమాధానం కూడా చెప్పుకోలేపోయిన కాంగ్రెస్ ఇప్పుడు తాను కూడా గట్టిగానే అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు మైండ్ గేమ్ ఆడుతోంది.
టీ కాంగ్రెస్‌లో ఉన్న కొందరు సీనియర్ లీడర్లు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన మంత్రులతో పాటు కొందరు ఎమ్మెల్యేలు తమకు కోవర్టులుగా ఉన్నారని, వీరంతా వచ్చే ఎన్నికలకు ముందుగా తమ పార్టీలోకి వస్తారని టీ కాంగ్రెస్ నేతలు చేస్తోన్న కామెంట్లు ఇప్పుడు టీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్నాయి.
రెండు రోజుల క్రితం భట్టి విక్రమార్క్ టీఆర్ఎస్ నుంచి 7-8 మంది మంత్రులు కాంగ్రెస్‌లోకి వస్తారని బాంబు పేల్చారు. ఈ విషయంపై టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చినా ఆ కోవర్టులు ఎవరన్న టెన్షన్ మాత్రం ఆ పార్టీకి పట్టుకుంది. ఇదిలా ఉండగానే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరో సంచలన కామెంట్ చేశారు. తను పార్టీ మారడం గురించి క్లారిటీ ఇస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావు గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ బిజేపీలో చేరనున్నట్లు ఇటీవల మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఆయన తాము పార్టీ మారేది లేదని, కాంగ్రెస్‌లోనే కొందరు తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే మరో బాంబు పేల్చారు. టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న కేసీఆర్ మేనళ్లుడు, మంత్రి హరీష్‌రావుతో పాటు మరికొందరు తమ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని ఆయన చెప్పారు.
వాస్తవం ఎంత…?
కోమటిరెడ్డి మాటల సంగతి ఇలా ఉంటే పార్టీలో కూడా హరీష్ ప్రాధాన్యత రోజు రోజుకు తగ్గుతోందని అర్థమవుతోంది. 2019 ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ కేసీఆర్ హరీష్‌కు వ్యూహాత్మకంగా ప్రాధాన్యత క్రమంగా తగ్గించే పనిలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన కుమారుడు మంత్రి కేటీఆర్‌ను పార్టీలొ మరింతగా ప్రమోట్ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రాబోయే ఎన్నికల నాటికి కేటీఆర్‌ను సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఆదిశగా అడుగులు వేస్తున్నారన్న చర్చలు నడుస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో కూడా గులాబీబాస్ హరీశ్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడ్డం గులాబీశ్రేణుల్లో చర్చనీయాంశం అయింది. మరి పార్టీలో తనకు ఇంత అవమానం జరుగుతోన్న టైంలో ఆయన పొలిటికల్ రూటు ఎలా ఉంటుందో ? అన్నది మాత్రం సస్పెన్సే.