న‌క్ష‌త్రం TJ రివ్యూ

టైటిల్: నక్షత్రం

జానర్: యాక్షన్ మూవీ

న‌టీన‌టులు : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనా, ప్రగ్యా జైస్వాల్, తనీష్, ప్రకాష్ రాజ్

సంగీతం : మణిశర్మ, భీమ్స్, భరత్ మధుసూదన్, హరి గౌర

నిర్మాత : కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు

దర్శకత్వం: కృష్ణవంశీ

రిలీజ్ డేట్‌: 04 ఆగ‌స్టు, 2017

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా గ‌తంలో ఎన్నో హిట్ సినిమాలు తీసిన కృష్ణ‌వంశీ గ‌త కొద్ది రోజులుగా వ‌రుస ప్లాపుల‌తో ఫామ్‌లో లేక ఇబ్బందులు ప‌డుతున్నాడు. అలాంటి కృష్ణ‌వంశీ లాంగ్ గ్యాప్ త‌ర్వాత తీసిన సినిమా న‌క్షత్రం. సందీప్‌కిష‌న్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, రెజీనా, ప్ర‌గ్య జైశ్వాల్ కాంబోలో తీసిన సినిమా న‌క్ష‌త్రం. రిలీజ్‌కు ముందే ఎన్నో క‌ష్టాల‌తో ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

రామారావు (సందీప్ కిష‌న్‌) ఫ్యామిలీ తాత‌ల కాలం నుంచి పోలీస్ కుటుంబం కావ‌డంతో తాను కూడా పోలీస్ కావాల‌ని క‌ష్ట‌ప‌డుతూ ఉంటాడు. పోలీసుల‌ను ఒక్క మాట అనేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌ని రామారావు ఓ చిన్న గొడ‌వ‌లో అనుకోకుండా పోలీస్ క‌మిష‌న‌ర్ కొడుకు రాహుల్ (త‌నీష్‌)తో గొడ‌వ ప‌డ‌తాడు. పోలీసుల‌ను కొట్టాడ‌న్న కోపంతో రాహుల్‌తో పాటు అత‌డి స్నేహితులను కూడా కొడ‌తాడు. ఈ క్ర‌మంలోనే రాహుల్ రామారావు మీద ప‌గ‌ప‌ట్టి అత‌డికి పోలీసు ఉద్యోగం రాకుండా చేస్తాడు.

ఉద్యోగం రాక‌పోవ‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని డిసైడ్ అయిన రామారావు స‌మాజాన్ని కాపాడేందుకు పోలీసే కావాల్సిన అవ‌స‌రం లేద‌ని పోలీస్ డ్యూటీ చేసేస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే ఓ రోజు కారులో బాంబులు తీసుకెళుతోన్న ముక్తార్‌ను రామారావు ప‌ట్టుకుంటాడు. ఇక్క‌డ జ‌రిగిన సిచ్యువేష‌న్‌లో కారుతో స‌హా బాంబులు పేలిపోతాయి. ఈ బ్లాస్ట్ వీడియో టీవీలో చూసిన పోలీసులు రామారావు యూనిఫాం మీద అలెగ్జాండర్ అని నేమ్ ప్లేట్ ఉండటంతో అతని కోసం వెతకటం మొదలు పెడతారు.

అసలు అలెగ్జాండర్ ఎవరు..? బాంబ్ బ్లాస్ట్ చేసిన ముఖ్తార్‌కు అలెగ్జాండ‌ర్‌కు ఉన్న సంబంధం ఏంటి ? అలెగ్జాండ‌ర్ ఏమ‌య్యాడు ? ఈ గొడ‌వ‌ల నుంచి రామారావు ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు ? మ‌రి రామారావుకు పోలీస్ ఉద్యోగం వ‌చ్చిందా ? లేదా ? అన్న‌దే న‌క్ష‌త్రం సినిమా స్టోరీ.

TJ విశ్లేష‌ణ‌:

నక్షత్రంలో కృష్ణవంశీ క్రియేటివిటీ అక్కడక్కడా తళుక్కున మెరిసినా అత‌డి పాత చిత్రాల‌నే గుర్తుకు తెస్తుంది. న‌టీన‌టుల ప‌రంగా మాత్రం అంద‌రూ మంచి ఎఫ‌ర్టే పెట్టారు. సందీప్ కిషన్ మాస్ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ మంచి నటనతో మెప్పించాడు. నెగిటివ్ రోల్‌లో త‌నీష్ ఓకే అనిపించాడు. గెస్ట్ రోల్‌లో చేసిన సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా ఉన్న‌ది త‌క్కువ సేపే అయినా త‌న‌దైన స్టైల్లో పాత్ర‌కు న్యాయం చేశాడు.

ఇక కృష్ణవంశీ అంటే హీరోయిన్స్‌ను అందంగా చూపించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. ఈ సినిమాలో తన క్రియేటివిటీని పూర్తిగా వాడేశాడు. ఏనుగుపై సందీప్ కిషన్‌తో రొమాన్స్ చేస్తున్న‘రెజీనా’ గ్లామర్ షోను షురూ చేసింది. ఇక ప్రగ్యా జైస్వాల్ తానేమీ తక్కువ కాదన్నట్టు హీరోతో కలిసి బీచ్‌లో బీర్ బాటిల్ ఎత్తేసి అందాలు ఆరబోసేసింది. రెజీనా పాత్ర కేవలం గ్లామర్ షోకే పరిమితం కాగా.. ప్రగ్య‌ జైస్వాల్ గ్లామర్ తో పాటు యాక్షన్స్ సీన్స్ తోనూ అలరించింది. ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, బ్రహ్మాజీ లు తమ పరిధిమేరకు పాత్రలకు న్యాయం చేశారు.

‘ఉద్యోగం లేకపోయినా యూనిఫాం వేసుకుని దేశానికి సేవ చేయొచ్చనే కాన్సెప్ట్’కృష్ణవంశీకి కొత్తేం కాదు. తన కెరీర్ కు ఎంతో కీలకమైన సినిమా విషయంలో దర్శకుడు కృష్ణవంశీ మరోసారి నిరాశపరిచాడు. తన గత చిత్రాల మాదిరిగా క్రైం, లవ్, దేశభక్తి లాంటి అంశాలను కలిపి చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఆకట్టుకోలేకపోయాడు.

తొలి భాగం అంతా అసలు కథను స్టార్ట్ చేయకుండా గ్లామర్ షోతో నడిపించేయటం బోర్ కొట్టిస్తుంది. ఇంటర్వెల్ తరువాత అసలు కథలోకి ఎంటర్ అయినా.. కథనం మాత్రం నెమ్మదిగా సాగింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లు ఆకట్టుకున్నా అప్ప‌టికే ప్రేక్ష‌కుడు విసిగిపోయాడు.

ప్ల‌స్ పాయింట్స్ (+) :

– ప్ర‌ధాన తారాగ‌ణం న‌ట‌న‌

– మెయిన్ స్టోరీ

– ఆర్ ఆర్‌

– యాక్ష‌న్‌

మైన‌స్ పాయింట్స్ (-):

– లింక్ లేని సీన్లు

– ఫ‌స్టాఫ్‌

– స్లో స్క్రీన్ ప్లే

– అర్థం లేని క్లైమాక్స్‌

ఫైన‌ల్ పంచ్‌: మెర‌వ‌ని న‌క్ష‌త్రం

‘ న‌క్ష‌త్రం ‘ మూవీ TJ రేటింగ్‌: 2 / 5