ఏపీలో కీలకమైన విజయవాడ టీడీపీ కొత్త అధ్యక్షుడి కోసం టీడీపీలో అదిరిపోయో ఫైటింగ్ జరుగుతోంది. కీలకమైన విజయవాడ నగరంపై పట్టు సాధించేందుకు ఇక్కడ సమర్థుడైన వ్యక్తికి పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే విజయవాడ అర్బన్ టీడీపీ పగ్గాలు చేపట్టే కొత్త వ్యక్తి ఎవరన్నదానిపై రకరకాలుగా చర్చలు స్టార్ట్ అయ్యాయి.
మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ముందస్తు ఎన్నికల టాక్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు విజయవాడలో గెలుపుకోసం అధ్యక్షుడితో పాటు కీలక వ్యక్తులకు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం అర్బన్ టీడీపీ అధ్యక్షుడిగా బుద్ధా వెంకన్న ఉన్నారు. మరోసారి బలహీనవర్గాల నుంచి ఆయన అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. చంద్రబాబుతో పాటు లోకేశ్‌తో ఉన్న సాన్నిహిత్యం తనకు ఉపయోగపడుతుందని వెంకన్న భావిస్తున్నారు.
అయితే ఈ సారి కమ్మ సామాజికవర్గానికి అధ్యక్ష పదవి ఇవ్వాలన్న మరో డిమాండ్ తెరమీదకు వచ్చింది. ఈ సామాజికవర్గం నుంచి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న గన్నే వెంకట నారాయణ ప్రసాద్‌తో పాటు సీనియర్ నేత తూమాటి ప్రసాద్ కూడా రేసులో ఉన్నారు. ఇక బలహీనవర్గాల నుంచి లుక్కా సాయిరాం గౌడ్ సైతం అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు.
కొత్త అధ్యక్షుడి ఎంపిక విషయంలో చంద్రబాబుకు సైతం తలనొప్పిగానే ఉంది. ప్రస్తుతం ఉన్న వెంకన్నను కంటిన్యూ చేయాలా ? లేదా ? కమ్మ సామాజివకర్గానికి ఈ పదవి ఇవ్వాలా ? అన్నది ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ పదవిని తమ వర్గానికి చెందిన వారికి ఇప్పించుకునేందుకు ఎంపీ, నగర ఎమ్మెల్యేలు సైతం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.