రాజకీయాల్లో సమయం, సందర్భం చాలా కీలకం. ఒక సమయంలో చేయాల్సిన పనులు వేరే సమయంలో చేసినా.. ఒక సందర్భంలో మట్లాడాల్సిన మాట.. వేరే సందర్భంలో మాట్లాడినా.. వాటి ఫలితం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోనూ ఇలాంటి సంఘనలు జరుగుతున్నాయి. యాదృశ్చికంగా జరుతోందో లేక వ్యూహం ప్రకారం జరుగుతోందో తెలీదు గాని ప్రతిపక్ష నేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ మధ్య రన్నింగ్ రేస్ ఒక రేంజ్లో జరుగుతోంది. ప్రత్యేక హోదా, ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో, ఇప్పుడు రైతుల సమస్యలపై జగన్ స్పందించిన వెంటనే పవన్ కూడా స్పందించడం ఆసక్తికరంగా మారింది.
చాలా రోజుల తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలనీ, రైతుల్ని ఆదుకోవాలంటూ ఒక లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు పడుతున్న కష్టాల నేపథ్యంలో రెండు ప్రభుత్వాలను ఉద్దేశించి లేఖ విడుదల చేశారని భావించాలి. ఇక అసలు విషయం ఏంటంటే పవన్ ఈ సందర్భంలోనే ఎందుకు రాశారూ అని! ఈ సందర్భం అంటే.. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి రైతు దీక్ష సభ పెట్టిన సమయంలోనే పవన్ స్పందించడం చర్చనీయాంశమైంది. గుంటూరులో రైతు దీక్ష సభ విరమించే సమయానికి పవన్ కల్యాణ్ లేఖ మీడియాకు విడుదలైంది.
ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు ప్రతీసారీ ఇదే జరుగుతోందని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. ప్రత్యేక హోదా, తుందుర్రు ఆక్వా రైతుల సమస్య, అగ్రిగోల్డ్ బాధితులతో సమావేశం, రాజధాని నిర్వాసితుల సమస్య నుంచీ నేటి మిర్చి రైతుల గిట్టుబాటు ధరల వరకూ ప్రతీ అంశంలోనూ పవన్ స్పందిస్తున్నారు. ప్రతిపక్ష నేత జగన్ ఏయే అంశాలపై స్పందించి పోరాటం చేస్తున్నారో కరెక్టుగా ఆ అంశాల్లోకి జనసేనాని ఎంట్రీ ఇచ్చేస్తుంటారు. ఇది కాకతాళీయంగా జరుగుతున్నా.. పక్కా ప్లాన్ తో జరుగుతున్నా ప్రతిపక్ష పార్టీ తలకెత్తుకోవాల్సిన అంశాల్ని మాత్రమే పవన్ టచ్ చేస్తుంటారు.
నిజానికి, ఆయన స్పందించకూడదని లేదు. ప్రజాసమస్యలపై పోరాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ, ప్రశ్నించిన సందర్భాన్ని మాత్రమే ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలనేది మర్చిపోకూడదు. చంద్రబాబుకు ఇబ్బందికరమైన ఇష్యూ ఏదైనా తెరమీదికి రాబోతోందని తెలిస్తే దాన్నుంచి కాపాడటం కోసమే పవన్ వెలుగులోకి వచ్చి, ప్రశ్నిస్తుంటారనే విమర్శ మొదట్నుంచీ ఉంది. దాన్ని పూర్తిస్థాయిలో తుడుచుకునే ప్రయత్నం ఇప్పటికీ పవన్ చేయడం లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి ముద్రతోనే ముందుకెళ్తుంటే వచ్చే ఎన్నికల్లో సోలో పర్ఫార్మెన్స్ కు ఆస్కారం ఎక్కడుంటుందనేది ప్రశ్న! మరి వీటిని దాటి బయటికి వస్తాడో లేక జగన్నే ఫాలో అవుతాడో!!