ముందస్తు ఎన్నికలతో ఏపీలో రాజకీయం రంజుగా మారుతోంది. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి వెళ్లిపోవాలని ఇప్పటి నుంచే ప్లాన్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కప్పదాట్లు, కప్పుల తక్కెడలు, జంపింగ్ జపాంగ్‌ల లిస్టులు రోజు రోజుకు పెరిగిపోనున్నాయి. ఈ క్రమంలోనే ఓ మాజీ మంత్రి సైతం తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం వైసీపీలోకి జంప్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు రూమర్లు వస్తున్నాయి.
విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పాడేరు నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి చేతిలో ఓడిపోయిన ఆయన అప్పటి నుంచి రాజకీయంగా స్తబ్దుగా ఉన్నారు.
ఇక వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఆయన వైసీపీలోకి జంప్ చేస్తారని సమాచారం. ఆయనకు వచ్చే ఎన్నికల్లో పాడేరు లేదా పక్కనే ఉన్న అరకు నియోజకవర్గాల్లో ఎక్కడో ఓ చోట జగన్ టిక్కెట్టు కేటాయించే అంశంపై కూడా చర్చలు నడుస్తున్నాయట. బాలరాజు పాడేరు నుంచి పోటీ చేస్తే అక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఈశ్వరి అరకు ఎంపీగా పోటీ చేస్తారని తెలుస్తోంది.