వైసీపీలో బొత్స చిచ్చు…మ‌రో వికెట్ డౌన్‌

నిన్న‌టి వ‌ర‌కు త‌న పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి వ‌రుస‌గా జంప్ చేసేయ‌డంతో షాక్‌ల మీద షాక్‌ల‌తో బెంబేలెత్తిన వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ ఇప్ప‌డిప్పుడే కాస్త జోష్‌లోకి వ‌స్తున్నారు. కీల‌క జిల్లాల‌కు చెందిన ఇత‌ర పార్టీల నేత‌లు, మాజీ మంత్రులు వైసీపీలోకి రావ‌డంతో పాటు..మ‌రికొంద‌రు వైసీపీ వైపు చూస్తుండ‌డంతో జ‌గ‌న్‌లో కొత్త జోష్ క‌న‌ప‌డుతోంది. ఈ జోష్ అలా వ‌చ్చిందే లేదో పార్టీలో ఓ మాజీ మంత్రి చిచ్చు జ‌గ‌న్‌కు ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారింది.

బొత్స స‌త్య‌నారాయ‌ణ‌… వివాదాల‌కు కేరాఫ్ అడ్రెస్‌. ఉత్త‌రాంధ్ర‌లోని విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన ఈ సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త దివంగ‌త మాజీ సీఎం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అండ‌తో ఓ వెలుగు వెలిగారు. వైఎస్ పాల‌న‌లో విజ‌య‌న‌గ‌రం జిల్లాను బొత్స ఫ్యామిలీ త‌మ‌కు సామంత రాజ్యం చేసుకుంది. బొత్స మంత్రిగా ఉంటే ఆయ‌న భార్య ఝాన్సీ విజ‌య‌న‌గ‌రం ఎంపీగా ఉన్నారు. మ‌రో సోద‌రుడు బొత్స అప్ప‌ల న‌ర‌స‌య్య గ‌జ‌ప‌తిన‌గ‌రం ఎమ్మెల్యేగాను, మేన‌ల్లుడు అప్ప‌ల నాయుడు నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యేగాను ఉన్నారు. జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్ ప‌ద‌వి సైతం బొత్స చేతిలోనే ఉండేది.

త‌ర్వాత బొత్స ఫ్యామిలీ అంతా క‌ట్ట‌క‌ట్టుకుని ఓడిపోవ‌డంతో వారంతా వైసీపీలోకి వ‌చ్చేశారు. బొత్స ఎక్క‌డుంటే వివాదాలు అక్క‌డే ఉంటాయి. ఆయ‌న ఎవ్వ‌రి మాట చెల్ల‌నీయ‌ర‌న్న టాక్ ఉంది. గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు ఆయ‌న జిల్లాలో ఎవ్వ‌రిని ఎద‌గ‌నీయ‌లేదు. ఇప్పుడు వైసీపీలో కూడా అదే ప‌రిస్థితి ఉంది. బొత్స వైసీపీ ఎంట్రీని జిల్లాలో చాలా మంది అడ్డుకున్నా జ‌గ‌న్ వారికి స‌ర్దిచెప్పి పార్టీలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు బొత్స వారంద‌రికి చుక్క‌లు చూపించేస్తున్నారు.

బొత్స‌తో వేగ‌లేక‌పోతోన్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు, పార్టీ ఎమ్మెల్సీ కొల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామి పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. తాజాగా యువభేరీ నిమిత్తం వైఎస్ జ‌గ‌న్ విజ‌య‌న‌గ‌రంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా త‌న‌కు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా… జ‌గ‌న్ మాత్రం బొత్స ఫ్యామిలీకి కాస్తంత ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చార‌ట‌. జ‌గ‌న్ త‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అల‌క‌బూనిన కోల‌గ‌ట్ల పార్టీ ప‌ద‌వికి గుడ్ బై చెప్పేశారు.

బొత్స దూకుడుతో త‌న‌కు పార్టీలో ఫ్యూచ‌ర్ ఉండ‌ద‌ని భావిస్తోన్న కోల‌గ‌ట్ల టీడీపీలో చేరేందుకు రెడీ అయిపోతున్నార‌ట‌.

కొల‌గ‌ట్ల రాజీనామా చేస్తే కాని రంగంలోకి దిగ‌ని వైసీపీ కీల‌క నేత‌లు… ఆయ‌న‌ను చ‌ల్ల‌బ‌రిచేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టార‌ట‌. ఇక జ‌గ‌న్ నేరుగా కొల‌గ‌ట్ల‌కు ఫోన్ చేసి మాట్లాడ‌నున్న‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ బొత్స‌ను భారీగా కంట్రోల్ చేస్తే త‌ప్ప కోల‌గ‌ట్ల జ‌గ‌న్ మాట వినే ప‌రిస్థితుల్లో లేరు. లేక‌పోతే వైసీపీలో మ‌రో ఎమ్మెల్సీ వికెట్ డౌన్ అయిన‌ట్టే.