భేతాళుడు TJ రివ్యూ

సినిమా : భేతాళుడు
రేటింగ్ : 2.5/5
పంచ్ లైన్ : భేతాళుడు బిచ్చగాడు కాలేడు

నటీనటులు : విజయ్ ఆంటోనీ,అరుంధతి నాయర్,చారు హాసన్ తదితరులు
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోనీ
సంగీతం : విజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ : ప్రతి కలిపురయత్
ఎడిటింగ్ : వీర సెంథిల్ రాజ్
కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం : ప్రదీప్ కృష్ణ మూర్తి

విజయ్ ఆంటోనీ అంటే తమిళ్ సంగతేమో గాని తెలుగులో అదొక బ్రాండ్ అయిపొయింది బిచ్చగాడు సినిమాతో.అంతలా తెలుగు ఇండస్ట్రీ కలెక్షన్స్ ని కుదిపేసిన డబ్బింగ్ సినిమా బిచ్చగాడు.దాని తరువాత ఆంటోనీ తరువాత సినిమా ఏంటనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.అందరి అంచనాలకు తగ్గట్టే భేతాళుడు అనే మరో వినూత్నమైన టైటిల్ ప్రకటించి ఆసక్తిని రెట్టింపు చేసాడు.బిచ్చగాడు బ్రాండ్ మొదటి రోజు ఓపెనింగ్స్ రాబట్టే వరకు అయితే ఉపయోగపడుతుంది కానీ..కథకి కథనానికి ఈ టైటిల్ భేతాళుడు కి ఎక్కడా పొంతనే ఉండదు.

బేసిక్ గా ఇది హర్రర్ కథ నో ,పూర్వ జన్మల బేస్ వుండే కథ నో..మెడికల్ ఫార్మా రంగం లో జరిగే దారుణాలు పైన తీసిన సినేమానా అర్థం కాదు.ఎందుకంటే ఇది ఫలానా జోనర్ సినిమా అనుకునే లోపే అప్పటి వరకు నడిచిన కథ పక్కకెళ్లి ఇంకో జోనర్ మొదలవుతుంది.ఇలా అస్థవ్యస్థనంగా అగమ్య గోచరంగా ఎటువెళ్తుందో తెలీని స్థితిలో ఒకానొక చోటశుభం పలికాడు ఈ భేతాళుడు.

మనకు తెలియని మనం చూడని దెయ్యం సినిమాలా..వారానికో దెయ్యం సినిమా వస్తున్న రోజులివి.. అలాగే మనం చూడని పూర్వ జన్మల సినిమాలా..బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో నుండి నిన్న మొన్నటి వరకు చూస్తూనే వున్నాం..ఇక ఫార్మా..మెడికల్ అవకతవకలపైనా ఇప్పటికే చాలా చూసేసాం.దీనర్థం వస్తున్న సినిమాలన్నీ ఎదో బ్రహ్మ పదార్ధం లాంటి కొత్త సబ్జక్ట్స్ అని కాదు కానీ ఓ మూడు జోనర్స్ ని కలగా పులగం చేసేసి దానికో వినూత్నమైన టైటిల్ పెట్టేస్తే సినిమా ఆడేస్తుందనుకోవడం మూర్ఖత్వం.

ఓ సాఫ్ట్వేర్ కంపెనీ లో పనిచేసే తెలివైన కుర్రాడి జీవితం లో పెళ్లి, ఉద్యగం ఫ్యామిలీతో సంతోషంగా సాగిపోయే సమయంలో అతనికి ఏవో శబ్దాలు, మాటలు వినపడ్డం మొదలయ్యి అవి అతని జీవితాన్ని ఎలా కుదిపేశాయి తరువాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే కతాంశం

సినిమా మొదలవ్వడం దగ్గరినుండి ప్రథమార్థం మొత్తం గ్రిప్పింగ్ గా నడుస్తుంది.తరువాత ఏమి జరగబోతోంది అన్న సస్పెన్స్ తో ఇంటర్వెల్ వరకూ ప్రేక్షకుల్ని సినిమాలో లీనం చేస్తుంది స్క్రీన్ ప్లే.అయితే ఒక్కసారికి ఆ సస్పెన్స్ విడిపోయిన తరువాత సినిమా అంతా పేలవంగా అనిపిస్తుంది.దీన్ని కవర్ చేయడానికి అన్నట్టు సెకండ్ హాఫ్ లో ఇంకో సస్పెన్స్ ఎలిమెంట్ ఎంటర్ అవ్వడం తో కథ మొత్తం గందరగోళం లో పడిపోతుంది.

విజయ్ ఆంటోనీ నటన ఎప్పటిలాగే నాచురల్ గా వుంది.హీరోయిన్ అరుంధతి నాయర్ బొద్దయిన రాధికా ఆప్టే ని తలపిస్తుంది.నటన పరంగా మళయాళీలకుండే సహజత్వం ఈమె లోను కనిపిసుతింది.అందం అభినయం రెండిట్లోనూ మంచి మార్కులే కొట్టేసింది.కాకపోతే కొంచెం వయసెక్కువ హీరోయిన్ లా అనిపిస్తుంది.మిగిలిన వాళ్లంతా ఎవరి పరిధిలో వాళ్ళు నటించి మెప్పించారు.

సంకేతింగా సినిమా అద్భుతం అనిపించక పోయినా బాగుంది.సినిమాటోగ్రఫీ బాగానే వున్నా ఇంకా ఎఫెక్టివ్ గా ఉండుంటే సినిమా మూడ్ క్యారీ అవ్వడానికి హెల్ప్ అయ్యేది.ఈ సినిమాకి సంగీతం కూడా విజయ్ ఆంటోనీ నే..వున్నా రెండు మూడు పాటలు బాగున్నాయి.నేపధ్య సంగీతం చాలా బాగుంది.మాటలు ఎప్పుడు చూసే డబ్బింగ్ సినిమా మాదిరే వున్నాయి.ప్రొడక్షన్ కూడా ఆంటోనీ సొంతంగా నిర్మించినా ఎక్కడా రాజీపడకుండా నిర్మించాడు,.

ఓవర్ అల్ గా ఆసక్తి కరంగా మొదలై ఇంటరెస్టింగ్ గా షేప్ అయిన కథకి లేని పోనీ ట్విస్ట్స్ తగిలించి సాగదీసి భారంగా మార్చేసి ముగించేశారు.విజయ్ ఆంటోనీ బిచ్చగాడు బ్రాండ్..కథలోని సస్పెన్స్ ఎలిమెంట్ ఎంతవరకు సినిమాని కాపాడుతాయా వేచి చూడాల్సిందే.