జ‌గ‌న్‌ను ఎలెర్ట్ చేసిన టీడీపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో కార్పొరేష‌న్‌, మున్సిప‌ల్ కార్పొరేష‌న్లకు ఎన్నిక‌లు.. రెండేళ్ల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు.. ఇప్ప‌టి నుంచే రాజ‌కీయ పార్టీలు త‌మ‌ వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్న వేళ‌.. ప్ర‌తిప‌క్ష వైసీపీని అధికార ప‌క్షం అలెర్ట్ చేసిందా? ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ వ‌ల‌లో త‌మ ఎమ్మెల్యేలు చిక్కుకోకుండా ప్రణాళిక‌లు ర‌చించేందుకు జ‌గ‌న్ అండ్ కోని టీడీపీ అప్ర‌మ‌త్తం చేసిందా? దీనిని ముందే ప‌సిగ‌ట్టిన అధినేత జ‌గ‌న్.. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌కు దిగారా? అంటే అవుననే స‌మాధాన‌మే వినిపిస్తోంది.

ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ రెండో ద‌శ‌కు టీడీపీ తెర‌తీసింది. వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న చేరిక‌తో ఈ ప‌ర్వానికి అడుగుప‌డింది. తొలి ద‌శ‌లో 20 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. కొంత‌కాలం ఈ ఆక‌ర్ష్‌కు గ్యాప్ ఇచ్చిన టీడీపీ.. మ‌ళ్లీ దీనిని ప్రారంభించింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగకుండా పెండింగ్ లో నున్న కర్నూలు – తిరుపతి – శ్రీకాకుళం గ్రేటర్ విశాఖ – కాకినాడ – గుంటూరు – ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లకు రాజంపేట – రాజమండ్రి. నెల్లిమర్ల – కందుకూరు మున్సిపాలిటీల ఎన్నిక‌ల‌కు త్వరలో ముహుర్తుం ఖరారు కానున్నది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయం కోసం అధికార టీడీపీతోపాటు అన్ని పక్షాలు జోరుగానే సన్నద్దమవుతున్నాయి.

ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొంటోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీని నైతికంగా దెబ్బ‌తీయాల‌ని టీడీపీ యోచిస్తోంది. దీంతో ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఉప్పులేటి చేరిక ఇందుకు బ‌లాన్ని చేకూరుస్తోంది. దీంతో అధినేత జ‌గ‌న్ అల‌ర్ట్ అయ్యారు. స్థానికంగా బలమైన నేతలు చేజారకుండా చూసుకోవాలని వైసీపీ సమాలోచనలు చేస్తోంది. ప్ర‌తి ఎమ్మెల్యే – నేతలతో వైసీపీలోని సీనియర్ నేతలు మంతనాలు జ‌రిపాలని నిర్ణ‌యించింది.

ఏపీకి హోదా అంశంలో ఇప్పటికే టీడీపీపై ప్రజాగ్రహం ఉందని ఎన్నికలు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్నందున తమ పార్టీ నుంచి అధికార పార్టీలోకి వెళ్లే ఎమ్మెల్యేలు ఉండకపోవచ్చని సీనియర్ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. పార్టీని దెబ్బ‌తీసేందుకు టీడీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌లు చేస్తున్నార‌న్నారు.