కేంద్రంపై బాబు కోపం న‌షాళానికెక్కిందే

2019 ఎన్నిక‌ల్లో గెలిచాక ఏపీ సీఎం చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై లెక్క‌లేన‌న్ని ఆశ‌లు పెట్టుకున్నారు. బాబు ఏపీ అభివృద్ధికి ఏదేదో చేసేస్తార‌ని ఎన్నో క‌ల‌లు క‌ని ఉంటారు. మోడీ మాత్రం చంద్ర‌బాబుతో పాటు ఏపీకి చుక్క‌లు చూపించేస్తున్నారు. మోడీపై ఎంత కోపం ఉన్నా చంద్ర‌బాబు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స‌హ‌నంతో భ‌రిస్తూ వ‌చ్చారు.

మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టిన చంద్ర‌బాబు ఇది త‌న నిర్ణ‌య‌మే అని ఆయ‌న‌కు ఆయ‌నే పెద్ద డ‌ప్పుకొట్టుకున్నారు. రద్దయిన నోట్ల స్థానంలో కొత్తవి దొరక్క జనం ఇబ్బందులు పడేసరికి చంద్రబాబు మాట మార్చేశారు. మోడీ నిర్ణ‌యం సామాన్యుల‌కు అష్ట‌క‌ష్టాలు తెచ్చిపెట్టింది. ఈ నిర్ణ‌యంపై దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డంతో కేంద్రం ముఖ్యమంత్రులతో కమిటీ వేసి దానికి సారథ్య బాధ్యతలు చంద్రబాబుకు అప్పగించింది. దీంతో మ‌రోసారి బాబు మాట మార్చేశారు.

బ్లాక్ మ‌నీని ప‌క్క‌న పెట్టేసిన చంద్ర‌బాబు క్యాష్ లెస్ రూటు పట్టారు. అయినా కేంద్ర తీరులో మార్పు రాలేదో ఏమోగాని కేంద్రం, మోడీపై ఆయ‌న కోపం న‌షాళానికెక్కిన‌ట్లుంది. తాజాగా జ‌రిగిన మంత్రివర్గంతో జరిపిన సమావేశంలో కేంద్రంపై బాబు తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం. రాష్ట్రానికి త‌గినంత న‌గ‌దు ఇవ్వ‌డం లేద‌ని ఫైర్ అయ్యార‌ట‌. హుదూద్ లాంటి పెద్ద తుఫాన్‌లు వ‌చ్చిన‌ప్పుడే తాను వైజాగ్‌లో స‌మ‌స్య‌లు కేవ‌లం వారం రోజుల్లో య‌ధాస్థితికి తీసుక వ‌చ్చాన‌ని… కేంద్రం ఈ స‌మ‌స్య‌ను నెల రోజులు దాటినా ప‌రిష్క‌రించ‌లేద‌ని ఫైర్ అయ్యారు.

ఇక ఇదే పెద్ద నోట్ల అంశంపై రాష్ట్రంలో ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాల‌ను సైతం మంత్రుల‌తో చ‌ర్చించిన చంద్ర‌బాబు ఆర్‌బీఐపై కూడా త‌న అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ట్రానికి 20వేల కోట్లు పంపామని చెప్పినా ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం రూ.11500 కోట్లే వ‌చ్చాయ‌ని..మిగిలిన నోట్లు ఎప్పుడు వ‌స్తాయో అర్థం కావ‌డం లేద‌ని బాబు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ట‌. 38 రోజులైనా ఈ విష‌యంలో ప‌రిస్థితులు సాధార‌ణ స్థితికి రాక‌పోవ‌డంతో కేంద్రంపై బాబు కోపం ఓ రేంజ్‌లో ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది.