ఆ ఒక్క స్టెప్‌తో జ‌గ‌న్ చేతిలో చంద్ర‌బాబు బుక్‌

ప్ర‌పంచానికే మేధావిన‌ని, బిల్‌గేట్స్ లాంటి వాళ్ల‌కి సైతం తాను గైడ్ చేసే రేంజ్‌లో ఉంటాన‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు తాజాగా ఓ త‌ప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు. అదికూడా నిత్యం తిట్టిపోసే వైకాపా అధినేత‌, విప‌క్ష నేత జ‌గ‌న్‌కి! ఇంకేముంది జ‌గ‌న్ ఊరుకుంటాడా? మ‌రింత‌గా రెచ్చిపోయాడు. బాబు చేసిన త‌ప్పును ఎత్తి చూపుతూ.. ప్ర‌పంచంలో ఇలాంటి వ్య‌క్తి ఇంకెవ‌రైనా ఉంటారా? అంటూ జ‌గ‌న్ విరుచుకుప‌డ్డాడు. విష‌యంలోకి వెళ్లిపోతే.. పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం దేశం మొత్తం బ్యాంకుల ముందు క్యూ క‌ట్టింది. ఈ బాధ‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో రైతులు, కూలీలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను గ‌వ‌ర్న‌ర్‌కి వివ‌రించేందుకు జ‌గ‌న్ మంగ‌ళ‌వారం రాజ్‌భ‌వన్‌కి వెళ్లారు.

గ‌వ‌ర్న‌ర్‌కి విన‌తి ప‌త్రం అందించిన త‌ర్వాత‌.. బ‌య‌ట‌కు వ‌చ్చిన జ‌గ‌న్‌.. పెద్ద నోట్ల ర‌ద్దు, అనంతర ప‌రిణామాల‌పై మాట్లాడ‌తార‌ని మీడియా మిత్రులు భావించారు. అయితే, దీనికి విరుద్ధంగా జ‌గ‌న్ నేరుగా త‌న బాణాన్ని చంద్ర‌బాబుపై సంధించారు. పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యం గోప్యంగా ఏమీ లేద‌ని, ఇదంతా చంద్ర‌బాబుకు ముందుగానే తెలుస‌న‌ని అన్నారు. అంతేకాదు, అక్టోబ‌రు 12నే చంద్ర‌బాబు అన్నీ స‌ర్దుకున్నార‌ని ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గ‌తంలో బాబు గొప్ప‌గా చెప్పుకొన్న విష‌యాన్ని ఉటంకించారు. పెద్ద నోట్లు ర‌ద్దు చేయాల‌ని నేనే ప్ర‌ధానికి లేఖ‌రాశాన‌ని బాబు అప్ప‌ట్లో చెప్పారు.

ఇదే విష‌యంపై రెచ్చిపోయిన జ‌గ‌న్.. పెద్ద నోట్ల ర‌ద్దు విష‌యం ముందుగానే తెలుసుకున్న బాబు.. త‌న హెరిటేజ్‌ను ఫ్యూచ‌ర్ గ్రూప్‌కి అమ్మేసుకున్నార‌ని ఆరోపించారు. అంతేకాకుండా టీడీపీ నేత‌లు చాలా మంది ముందుగానే బ్లాక్ మ‌నీని వైట్ చేసుకున్నార‌ని కూడా చెప్పారు. నోట్ల ర‌ద్దు విష‌యం తెలుసుకాబ‌ట్టే.. ఆ క్రెడిట్‌ను త‌న ఖాతాలో వేసుకునేందుకు అక్టోబ‌రులో ప్ర‌ధానికి లేఖ‌రాశార‌ని జ‌గ‌న్ అన్నారు. మొత్తానికి బాబు రాసిన లేఖను అడ్డం పెట్టుకుని జ‌గ‌న్ బాబుకి రాజ్‌భ‌వ‌న్ సాక్షిగా రేవు పెట్టేశార‌న్న‌మాట‌. అంటే, బాబు ఆ ఒక్క స్టెప్‌తో జ‌గ‌న్ చేతిలో బాబు బుక్ అయిపోయార‌న్న‌మాట‌!!