ప్రముఖ మలయాళీ నటుడు మోహన్‌లాల్‌కు ప్రస్తుతం శుక్రదశ నడుస్తున్నట్టుంది. అవును మరి… మోహన్‌లాల్ నటించిన సినిమాలు ఇటీవల సాధిస్తున్న సంచలన విజయాలు చూస్తే ఎవరికైనా అలాగే అనిపించడం ఖాయం. మలయాళంలో మరో స్టార్ హీరో మమ్ముట్టితో కలిసి దాదాపు మూడు దశాబ్దాలుగా అగ్రస్థానాన్ని పంచుకుంటూ వస్తున్న మోహన్‌లాల్.. ఈ ఏడాది ఎవరూ ఊహించని స్థాయిలో అందుకున్న సక్సెస్‌లతో ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. కేవలం రెండు నెలల వ్యవధిలో మూడు సూపర్ సక్సెస్‌లను ఈ సౌత్ ఇండియన్ స్టార్ హీరో తన ఖాతాలో వేసేసుకున్నాడు.
ఏడాదికో హిట్ సినిమాలకోసం పలవురు హీరోలు పడరాని పాట్లు పడుతూ ఉంటే.. అలవోకగా హిట్ మీద హిట్ కొట్టేస్తున్నాడీ లెజండరీ నటుడు. మోహన్‌లాల్ తెలుగులో ఇటీవలే సూపర్ డూపర్ హిట్ నిలిచిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్‌లో ప్రముఖ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. హీరోతో పాటు.. కథలో ప్రాధాన్యం ఉన్న రోల్ ను మోహన్‌లాల్ పోషించడం ఈ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సినిమా వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్కును అలవోకగా క్రాస్ చేసి తెలుగులో ఆల్ టైమ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది.
సరిగ్గా ఈ సినిమా విడుదలైన వారం రోజుల గ్యాప్‌లోనే మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘ఒప్పం’ విడుదల అయ్యింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా అక్కడ సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకు దాదాపు అరవై కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయని మలయాళ ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
మోహన్‌లాల్ విజయ యాత్ర ఇంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత కొంత విరామంతో విడుదల అయిన మరో సినిమా ‘పులి మురుగన్’ సైతం ఎవరూ ఊహించని స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుని అందరినీ అబ్బురపరిచింది.. ఈ సినిమా ఇప్పటి వరకూ 50 కోట్ల రూపాయల కలెక్షన్ల వర్షాన్ని కురిపించి ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.. ఒకటి వంద కోట్లు, మరోటి అరవై కోట్లు, ఇంకోటి యాభై కోట్లతో ఇంకా రన్నింగ్… ఇదీ ప్రస్తుతం గత రెండునెలల్లోనూ మోహన్‌లాల్ సక్సెస్ గ్రాఫ్..