బాబు కేబినెట్‌లో ఆ రెడ్డిగారు అవుట్‌..!

ఏపీ క్యాబినెట్‌లో దీపావళికి కాస్త అటూ ఇటూగా ప్ర‌క్షాళ‌న జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని, కొంద‌రు కొత్త స‌భ్యులకు మంత్రివ‌ర్గంలో స్థానం ద‌క్క‌నుంద‌నీ, అదే స‌మ‌యంలో కొంద‌రు పాత కాపుల‌కు క్యాబినెట్ నుంచి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌నీ టీడీపీ అధిష్ఠానం కొంత‌కాలంగా సంకేతాలు పంపుతూ వ‌స్తోంది.  ఇక ఇప్పుడు దీపావ‌ళి సంబ‌రాలు ముగిసిన‌ట్టే..   మరి ఇప్పుడైనా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా.. అని పార్టీలోని ఆశావ‌హులు స‌హ‌జంగానే ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. మ‌రి కొత్త‌గా ఎవ‌రెవ‌రిని మంత్రిప‌ద‌వులు వ‌రించ‌నున్నాయ‌నేది ఆస‌క్తిక‌రంగానే క‌నిపిస్తోంది.

ఇక మంత్రి వ‌ర్గంలోంచి తప్పించేదెవ‌రినా అన్న చ‌ర్చ‌లు టీడీపీలో అంత‌ర్గ‌తంగా గట్టిగానే జ‌రుగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి, టీడీపీ అనుకూల మీడియా వర్గాలు కొద్దిరోజులుగా ప్ర‌చారంలో పెట్టిన వార్త‌…రాయలసీమకు చెందిన ఒక మంత్రికి చంద్ర‌బాబు క్యాబినెట్ నుంచి  త్వ‌ర‌లోనే ఉద్వాస‌న ఖాయ‌మ‌ని. ఇంత‌కీ రాయ‌లసీమ‌కు చెందిన స‌ద‌రు మంత్రివ‌ర్యులు ఎవ‌రా అని వాక‌బు చేస్తే తెలుస్తున్న విష‌య‌మేమిటంటే ఆ మంత్రి ఎవ‌రో కాదు ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డేన‌ట‌. ఆయ‌న ప‌నితీరుపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అంత‌ సంతృప్తిగా లేర‌ని తెలుస్తోంది.

నిజానికి ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిని క్యాబినెట్లో కొన‌సాగిస్తూనే.. కొన్నిశాఖ‌ల‌ను మాత్రం ఆయ‌న‌నుంచి త‌ప్పిస్తార‌న్న మ‌రోవాద‌నా ఇటీవ‌ల తెర‌మీదికొచ్చింది. అయితే ఇప్పుడు ఏకంగా మంత్రి ప‌ద‌వీ వియోగం త‌ప్ప‌క‌పోవ‌చ్చ‌ని టీడీపీ అంత‌ర్గ‌త‌ వ‌ర్గాలు తాజాగా తేల్చేస్తున్నాయి. ఇంత‌కీ ఆయ‌నను త‌ప్పించేందుకు కార‌ణ‌మేమిటంటే… రాయ‌ల‌సీమ ఇప్ప‌టికీ వైసీపీకి బ‌ల‌మైన ప్రాంతంగా ఉంది. ఇక్క‌డ ఆ పార్టీని దెబ్బ‌తీసేందుకు ఈ ప్రాంతానికి చెందిన‌ టీడీపీ మంత్రులు, స్థానిక నేత‌లు స‌మ‌న్వ‌యంతో ప‌ని  చేయాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి అక్క‌డి ప్ర‌జ‌ల్లో పార్టీకి ఆద‌ర‌ణ పెరిగేలా గ‌ట్టి కృషి చేయాల‌ని చంద్ర‌బాబు  ఆశిస్తున్నార‌ట‌. అయితే ఆ స్థాయిలో ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ప‌నితీరు లేకపోవ‌డంతో… చంద్ర‌బాబు క‌ఠిన నిర్ణ‌యాల‌వైపే మొగ్గే అవ‌కాశ‌ముంద‌ని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో స్వ‌యం ప్ర‌కాశ శ‌క్తిలేని  ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిని త‌ప్పించి, క‌ర్నూల్లో బ‌ల‌మైన రాజ‌కీయ నేత‌గా పేరున్న‌భూమా  నాగిరెడ్డి కుటుంబానికి మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టేందుకు చంద్ర‌బాబు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెపుతున్నాయి. త‌ద్వారా పార్టీని బ‌లోపేతం చేసుకునే అవ‌కాశంతోపాటు… రెడ్డి సామాజిక వ‌ర్గం అసంతృప్తికి గుర‌వ‌కుండా చూడ‌వ‌చ్చ‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహంగా తెలుస్తోంది.