ఏపీలో వెన్నుపోటు బ్ర‌ద‌ర్స్ ఎవ‌రో తెలుసా..

వైకాపా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా.. ఉర‌ఫ్ రోజ‌మ్మ‌.. మ‌రోసారి ఏపీ సీఎం చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో ఫైరైపోయారు. ప‌నిలోప‌నిగా కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడుపైనా నిప్పులు చెరిగారు. ప్ర‌త్యేక హోదాను ఏపీకి ఇవ్వ‌క‌పోగా ప్యాకేజీపై పోటా పోటీ స్టోరీలు చెబుతున్నార‌ని ఆమె విరుచుకుప‌డ్డారు. వాస్త‌వానికి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబునే టార్గెట్ చేసిన రోజా.. తాజాగా ప్యాకేజీ వ‌చ్చిన త‌ర్వాత నుంచి వెంక‌య్య‌ను కూడా అప్పుడ‌ప్పుడు టార్గెట్ చేస్తూ వ‌చ్చారు. అయితే,  తాజాగా మాత్రం మ‌రింతగా ఇద్ద‌రిపైనా ఆమె ఓ రేంజ్‌లో మండిప‌డ్డారు. కేంద్రం ప్ర‌క‌టించిన ప్యాకేజీని ప‌వ‌న్ పాచిపోయిన ల‌డ్డూల‌తో పోలిస్తే.. రోజా మ‌రో అడుగుముందుకేసి కుళ్లిపోయిన క్యాబేజీతో పోల్చింది.

ఇక‌, ఇప్పుడు ఏపీకి ప్ర‌త్యేక హోదా రాకుండా ఇద్ద‌రు నాయుళ్లు వెన్న‌పోటు పొడిచార‌ని ఫైరైంది. ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా ఇద్దరు వెన్నుపోటు బ్రదర్స్ అడ్డుకున్నారని ఆరోపించిన రోజా… హోదా కోసం పోరాడుతున్న విద్యార్థులను కూడా ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు.  ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని వెంకయ్య నాయుడు 15 ఏళ్లు కావాలని చంద్రబాబు కోరిన వాళ్లు మ‌రిచిపోయినా.. ఏపీ ప్ర‌జ‌లు ఇంకా గుర్తుంచుకున్నార‌ని, అందుకే ఉద్య‌మాలు చేస్తున్నార‌ని ఆమె చెప్పారు. అబద్దాలాడిన చంద్రబాబు – వెంకయ్యలను ఏం చేయాలని రోజా ప్రశ్నించారు.

హామీల అమలు కోసం పోరాడడం మానేసి దోమలపై యుద్ధం పేరుతో విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టిస్తారా? అని ప్ర‌శ్నించారు. పోనీ దోమ‌ల‌పై యుద్ధ‌మైనా స‌రిగా చేస్తున్నారా? అని నిల‌దీశారు.  సీఎం చంద్ర‌బాబు దత్తత తీసుకున్న‌ గ్రామం అరకులో విషజ్వరాలతో జనం చనిపోతున్నారని.. దోమలపై యుద్ధానికి అర్థం ఎక్కడుందని మండిపడ్డారు. అంతేకాకుండా చంద్ర‌బాబు త‌న సొంత జిల్లా చిత్తూరులోనే ప‌ట్టుకోల్పోయార‌ని, ఆ జిల్లాకు ఏమీ చేయ‌లేక‌పోతున్నార‌ని రోజా విరుచుకుప‌డ్డారు. మ‌రి ఈ వైకాపా ఫైర్ బ్రాండ్‌పై టీడీపీ త‌మ్ముళ్లు, చెల్లెళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా.. రోజా చేసిన‌ వెరైటీ కామెంట్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం.