2024లో బాక్సాఫీస్ షేక్ చేసే సినిమాల ఏవంటే..!?

ప్రస్తుతం దేశమంతటా తెలుగు సినిమా చర్చే జరుగుతోంది. బాహుబలితో దేశమంతటా మారుమ్రోగిన తెలుగు సినిమా, “ఆర్ ఆర్ ఆర్” చిత్రం ఆస్కార్ విజయంతో ప్రపంచమంతటా ఖ్యాతిని గడించింది. ఇక తాజాగా జాతీయ చలన చిత్ర పురస్కారాలలో కూడా తెలుగు సినిమా తన సత్తా చాటింది. ఇప్పుడు భారత దేశ సినీ ప్రేమికులు, తెలుగు పరిశ్రమ నుంచి రాబోయే తదుపరి పాన్ ఇండియా చిత్రం కోసం ఎదురు చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. ఐతే 2024 సంవత్సరం తెలుగుసినిమాకు అగ్ని పరీక్ష అంటున్నారు విశ్లేషకులు. దీనికి కారణం 2024 లో విడుదలకు సిద్దమవుతున్న మన పాన్ ఇండియా చిత్రాలే. ఈ చిత్రాల విజయం పైనే తెలుగు సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. మరి ఆ చిత్రాలేమిటో ఇప్పుడు చూద్దాం.

మొదటిగా మనం చర్చించవలసిన చిత్రం ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న “సాలార్” చిత్రం. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం అనుకున్న విజయాన్ని సాధిస్తే, తెలుగు ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా, ప్రభాస్ అభిమానులకు సంక్రాంతి ఒక నెల ముందే ఆరంభమవుతుంది. బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కు ఆ తరువాత చెప్పుకోదగ్గ హిట్ లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న డార్లింగ్ కు సాలార్ విజయం చాలా అవసరం. సాలార్ తో పాటు ప్రభాస్, నాగ అశ్విన్ కాంబోలో వెళ్తున్న ప్రాజెక్ట్ కే చిత్రం పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయ్.

ఇకపోతే ఈ జాబితాలో ఉన్న రెండో చిత్రం “పుష్ప – ది రూల్”. పుష్ప మొదటి భాగం దేశమంతటా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న జాతీయ పురస్కారాన్ని కూడా సాధించింది. ఇక ఈ చిత్రం రెండో భాగాన్ని చిత్రీకరించే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రం కూడా అనుకున్న విజయాన్ని సాధిస్తే, రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.

ఆ తరువాత మన చర్చించవలసిన చిత్రాలు రామ్ చరణ్ “గేమ్ చెంజర్” మరియు జూనియర్ ఎన్టీఆర్ “దేవర” చిత్రాలు. “ఆర్ ఆర్ ఆర్” చిత్రంతో పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన వీరిద్దరి తదుపరి చిత్రాల పైన ఎంతో ఆసక్తిగా ఉన్నారు సినీ అభిమానులు. రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ చెంజర్ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయ్. అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న దేవర చిత్రంపై కూడా అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. వీటితో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ బాబు గుంటూరు కారం చిత్రాలు కూడా రేస్ లో ఉన్నాయ్. మరి ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సునామి సృష్టిస్తాయో, లేక బొక్క బోర్లా పడతాయో వేచి చూడాల్సిందే