పోగొట్టుకున్న చోటే తిరిగి అధికారం చేజిక్కించు కోవాలనుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన.. మరోసారి కాంగ్రెస్ గూటికి చేరారు. రాజగోపాల్ రెడ్డి రీ ఎంట్రీతో నల్గొండ జిల్లాలో పాలిటిక్స్ మరోసారి హీటెక్కుతున్నాయి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మునుగోడు నియోజకవర్గం గత ఉప ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. గత 2018 ఎన్నికల్లో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన రాజగోపాల్ రెడ్డి… నియోజకవర్గ అభివృద్ధి పేరుతో బీజేపీ పార్టీలో చేరారు. కేసీఆర్‌కు ప్రత్యామ్నాయంగా అప్పట్లో బీజేపీ ఉండడంతో అందులో చేరి…. ఉప ఎన్నికల్లో 10 వేల ఓట్లతో ఓటమి చెందారు. మునుగోడు నియోజకవర్గం పై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్ పకడ్బందీ వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకున్నారు. అయితే బీజేపీలో చేరింది బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉందనే రాజగోపాల్ రెడ్డి పదే పదే చెబుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డిని మొదటి నుంచి వ్యతిరేకించిన వారిలో ఒకరు రాజగోపాల్ రెడ్డి. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తెలంగాణలోనూ సీన్ రివర్స్ అయ్యింది.
బీజేపీలో కొనసాగుతున్న రాజ్ గోపాల్ రెడ్డికి జాతీయ స్థాయిలో పదవి, తెలంగాణ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా నియమించినా పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకూ పెరిగిపోతున్న గ్రాఫ్‌తో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారుతున్నారు. ఈ క్రమంలో రాజగోపాల్ రెడ్డి ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ నుండి పోటీ చేస్తే ఓటమి ఖాయమని ఓ సర్వేలో తేలడంతో ఓ నిర్ణయానికి వచ్చారట. పార్టీ మార్పు జరిగితేనే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయనే భావనలో ఉన్న రాజగోపాల్ రెడ్డి.. ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే బీజేపీలో కొనసాగాలంటే మునుగోడులో తన సతీమణి లక్ష్మికి, ఎల్బీ నగర్ నుండి తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని బీజేపీ పెద్దల దృష్టిలో ఉంచారట. బీజేపీ అగ్ర నాయకులు సానుకూలంగా ఉండకపోవడం.. పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొనే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండడంతో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కొన్ని నిర్ణయాలతో తెలంగాణ బీజేపీ బలహీనపడిందన్నారు.
రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీతో ఆ ప్రభావం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పడే అవకాశం లేకపోలేదు. కోమటిరెడ్డి సోదరులకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రధానంగా మునుగోడులో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పాల్వయి స్రవంతి, చల్లమల కృష్ణారెడ్డిలు టికెట్ ఆశిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. వారికి టికెట్ రాకున్నా.. కాంగ్రెస్ పెద్దలు భవిష్యత్తు భరోసా ఇవ్వకున్నా కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఖాయం. రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి కష్టమే అంటున్నారు విశ్లేషకులు. మరి రేవంత్ రెడ్డితో ఉన్న గ్యాప్, సోదరుడు వెంకట్ రెడ్డితో ఉన్న అనుబంధం అన్నీ ఎలా మేనేజ్ చేస్తారో అన్న చర్చ కూడా జరుగుతోంది.