అసలు ఆ ఇద్దరు ఏమయ్యారు… ఎక్కడున్నారు….?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్‌గా మారిపోయాయి. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉన్నప్పటికీ… ఇప్పటి నుంచే పరిస్థితులు గరంగరంగా మారాయి. నేతల యాత్రలతో బిజీ బిజీగా ఉన్న తరుణంలో… స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు… విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరపరిచారు. అక్కడ చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. అక్కడ నుంచి నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత నుంచి తెలుగుదేశం పార్టీకి న్యాయస్థానాల్లో వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇదే సమయంలో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. దీంతో పొలిటికల్‌ సర్కిల్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది.

చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారని… అరెస్టు అక్రమమని ఆరోపిస్తూ… ఏసీబీ కోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు టీడీపీ నేతలు. అక్కడ ఎదురు దెబ్బ తగలడంతో… వెంటనే హైకోర్టుకు వెళ్లారు. చివరికి అక్కడ కూడా అరెస్ట్ సక్రమమే అంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్ కొట్టివేశారు. దీంతో చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు చంద్రబాబు తరఫు న్యాయవాదులు. అయితే… ఇదే సమయంలో ఇద్దరి వ్యవహారం మాత్రం పొలిటికల్ సర్కిల్‌లో తెగ చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అయితే… మరొకరు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్. చంద్రబాబు అరెస్టు అయిన తర్వాత నాలుగు రోజుల పాటు ఈ ఇద్దరు హడావుడి చేశారు. ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో రోడ్డుపై బైఠాయించి మరీ నిరనస తెలిపిన పవన్. ఏపీలోకి రావాలంటే పాస్ పోర్ట్, వీసా తీసుకోవాలేమో అంటూ కామెంట్లు కూడా చేశారు. ఆ తర్వాత నేరుగా రాజమండ్రి వెళ్లి… సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. ఆ తర్వాత బయటకు వచ్చి… కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే… ఆ తర్వాత నుంచి పవన్ కనిపించడం లేదు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండు రోజుల పాటు పార్టీ కార్యకర్తలతో రివ్యూలు నిర్వహించిన పవన్… ఆ తర్వాత నుంచి మాయమైపోయారు. అటు నారా లోకేశ్‌ కూడా పవన్‌తో భేటీ తర్వాత ఢిల్లీ వెళ్లిపోయారు. పది రోజులుగా అక్కడే ఉన్నారు తప్ప… తిరిగి రావడం లేదు. అసలు ఢిల్లీ ఎందుకు వెళ్లారనేది ఇప్పటికే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏపీకి వస్తే అరెస్టు చేస్తారనే భయంతోనే లోకేశ్ రావడం లేదని ఇప్పటికే వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ వైపు చంద్రబాబు అరెస్టు, రిమాండ్, కస్టడీ వంటి పరిణామాలు జరుగుతుంటే… ఇలాంటి కీలక సమయంలో ఈ ఇద్దరు నేతల జాడ మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.