తెలంగాణలో స్పీడ్‌ పెంచిన కాంగ్రెస్‌

తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. త్వరలో అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటించనుంది. తొలివిడతలో 50 శాతానికి పైగా అభ్యర్థులను ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే స్పష్టం చేశారు. అటు రేవంత్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై.. స్క్రీనింగ్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కచ్చితంగా గెలిచే వారికే కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇవ్వనుంది. అటు.. టికెట్లు ఫైనల్ అయిన అభ్యర్థులు.. వారి వారి నియోజకవర్గాల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి.. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలపై ఎన్నికల వ్యూహకర్త సునీల్‌ కనుగోలు ఇప్పటికే కార్యక్రమాలకు కూడా ఫైనల్‌ చేసినట్లు తెలుస్తోంది.

ఢిల్లీలో మాణిక్‌రావు ఠాక్రేతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి భేటి అయ్యారు. రెండు విడతల్లో కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ విడుదల చేస్తామన్నారు మాణిక్‌రావు ఠాక్రే. త్వరలో మొదటి విడత జాబితా రిలీజ్ అవుతుందన్నారు. మొదటి విడతలో 50 శాతానికి పైగా అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు ఠాక్రే. అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేస్తుందన్నారు ఠాక్రే. కాంగ్రెస్‌ అభ్యర్థుల ఎంపికపై కొందరు దుష్ప్రచారం చేయడాన్ని మధుయాష్కి గౌడ్ ఖండించారు. కార్యకర్తల్లో అపోహలు సృష్టించొద్దన్నారు. అటు చేరికలపై కాంగ్రెస్‌ ఫోకస్ చేసింది. ఏఐసీసీ కార్యాలయంలో నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్‌, ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. వేముల వీరేశం అనుచరులకు కండువాకప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. త్వరలో గాంధీభవన్‌ వేదికగా భారీగా చేరికలు జరుగనున్నాయనే ప్రచారం జోరుగా జరుగుతోంది.