నార్కో అధికారులకు నవదీప్‌ ఏం చెప్పాడు…?

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు నవదీప్‌ను నార్కోటిక్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఉన్న లింక్‌లను అధికారులు ఆరా తీశారు. డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే తనను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని.. అవసరం ఉంటే మళ్లీ పిలుస్తామన్నారని నవదీప్ విచారణ అనంతరం వెల్లడించారు. ఈ విచారణలో నవదీప్ కి పలు ప్రశ్నలు అడిగినట్టుగా తెలుస్తోంది. నార్కోటిక్ విభాగం ఎస్పీ సునీత రెడ్డి, ఏసీపీ నరసింగ రావుతో కూడిన బృందం నవదీప్‌ని విచారించారు. దాదాపు ఆరు గంటలు పైగా ఈ విచారణ సాగింది. ఈ విచారణ బృందం ఆధారాలను నవదీప్ ముందు పెట్టి ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. బషీర్‌బాగ్‌లోని టీఎస్‌ నార్కోటిక్‌ విభాగం పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

విచారణ అనంతరం బయటకు వచ్చిన నవదీప్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు రావాలని నోటీసులు ఇస్తే వచ్చానన్నారు. తెలంగాణ నార్కోటిక్‌ అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉందన్నారు. ఏడేళ్ల క్రితం కాల్‌ లిస్ట్‌ ఆధారంగా తనను విచారించినట్లు పేర్కొన్నారు. విశాఖకు చెందిన రామచంద్‌తో పరిచయం ఉందని.. కానీ, అతని వద్ద ఎలాంటి డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ ఎక్కడా డ్రగ్స్‌ తీసుకోలేదన్నారు.

నవదీప్‌ను విచారించినట్లు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. తాము అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు వివరించారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో 81 లింకులు గుర్తించామని… 41 లింకుల వివరాలను నవదీప్‌ తెలిపాడన్నారు. డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్టు అంగీకరించాడన్నారు. రామ్‌చంద్‌తో కలిసి నవదీప్‌ గతంలో బీపీఎం పబ్‌ నిర్వహించాడని.. సెల్‌ఫోన్‌లో ఉన్న డేటాను నవదీప్‌ డిలీట్‌ చేసినట్లు ఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. నవదీప్‌ ఫోన్‌ డేటా పూర్తిగా వచ్చిన తర్వాతే మళ్లీ విచారణకు పిలుస్తామని పేర్కొన్నారు.

విచారణకు హాజరైన నవదీప్‌ సెల్‌ఫోన్‌ను నార్కోటిక్‌ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డేటా ఆధారంగా మరింత సమాచారం రాబట్టనున్నట్లు తెలిపారు. ఈనెల 14న మాదాపూర్ లోని ఒక అపార్టుమెంట్‌లో నార్కోటిక్ అధికారులు, పోలీసులు కలిసి సుమారు పది లక్షల రూపాయల విలువగల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకోవటమే కాకుండా, నలుగురు నైజీరియన్స్, ఒక సినిమా దర్శకుడు, నలుగురు ఇతర వ్యక్తుల్ని అరెస్టు చేశారు. ఇందులో రాంచందర్ అనే వ్యక్తి డ్రగ్ సప్లయర్ అని, అతనితో నవదీప్‌కి సంబంధాలు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు. దీనిలో భాగంగానే నవదీప్‌ని సుమారు ఆరు గంటలపాటు నార్కోటిక్ పోలీసులు విచారించారు.