తిరుపతి లడ్డూ వివాదం… కాంగ్రెస్ – బీజేపీ వార్…!

అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ తయారీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య వివాదానికి తెర లేపింది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి దాదాపు 50 ఏళ్లుగా కర్ణాటక పాల సరఫరా సమాఖ్య ఆవు నెయ్యి సరఫరా చేస్తోంది. ఒక దశలో తిరుమల లడ్డూకు అంత రుచి రావడానికి కారణం కర్ణాటక పాల సరఫరా సమాఖ్య సరఫరా చేసే నందిని బ్రాండ్ ఆవు నెయ్యి అని గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది కూడా. కానీ అంతటి పేరున్న నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా నిలిచిపోయింది. ఇప్పుడు ఇదే అంశం రాజకీయ వివాదానికి తెర లేపింది.

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆవు నెయ్యి సరఫరా నిలిచిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. హిందూ దేవాలయాలపై కాంగ్రెస్ పార్టీ పక్షపాతం చూపిస్తోందని సిద్ధరామయ్య సర్కారును ఇరుకున పెట్టేలా ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ నళిన్ కుమార్. దీంతో ఈ అంశం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య… టీటీడీకి ఆవు నెయ్యి సరఫరా నిలిచిపోవడం వెనుక అసలు కారణాలివీ అంటూ రుజువులతో సహా వెల్లడించారు. కర్ణాటక పాల సరఫరాదారుల సమాఖ్య నుంచి టీటీడీకి నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సిద్ధరామయ్య వెల్లడించారు. 2021లోనే బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే నందిని నెయ్యి సరఫరా నిలిపేసిందని సిద్దరామయ్య తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలు కూడా బయటపెట్టారు. 2021లోనే నెయ్యి సరఫరా నిలిపివేసిన బీజేపీ ప్రభుత్వం… ఇప్పుడు తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మరో అడుగు ముందుకు వేసిన సిద్ధరామయ్య… లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా నిలిపివేసిన బొమ్మై హిందూ వ్యతిరేకా… హిందువులకు బీజేపీ వ్యతిరేకమా అని నిలదీశారు. దీనికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాము గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోలేదన్నారు. మతపరమైన అంశాలతోనే రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ నేతలు ప్రయత్నం చేస్తున్నారని… అందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సిద్ధరామయ్య ఘాటుగా బదులిచ్చారు.