ఆ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు సాధ్యమేనా…!

తెలుగుదేశం పార్టీకి కొన్ని నియోజకవర్గాలు అందని ద్రాక్షాగానే మిగిలిపోయాయి. 2009లో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత ఏర్పడిన కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు టీడీపీ గెలిచిందే లేదు. టీడీపీ అధినేత ఎన్ని ప్రయోగాలు చేసినా సరే… అక్కడ మాత్రం పసుపు జెండా ఎగరడం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గతంలో ఈ నియోజకవర్గాల్లో చక్రం తిప్పిన నేతలే ఇప్పుడు గ్రూపు రాజకీయాలకు తెర లేపారనే పుకార్లు కూడా షికారు చేస్తున్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో సీనియర్లను కాదని… కొత్త వారికి అవకాశం కల్పించేందుకు కూడా చంద్రబాబు వెనుకాడటం లేదు.

2009లో కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం. అప్పటి వరకు మార్కాపురం నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం… 5 మండలాలతో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఏర్పడింది. దీంతో ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున తొలిసారి ప్రజాక్షేత్రంలో దిగారు ప్రస్తుత మంత్రి ఆదిమూలపు సురేష్. టీడీపీ తరఫున పాలపర్తి డేవిడ్ రాజు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బూదాల అజితారావు పోటీ చేయగా… వైసీపీ తరఫున డేవిడ్ రాజు పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత రెండేళ్లకు వైసీపీకి గుడ్ బై చెప్పిన డేవిడ్ రాజు… టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక 2019లో టికెట్ వస్తుందని డేవిడ్ రాజు ఆశించి భంగపడ్డారు. కానీ అధినేత మాత్రం అజితారావుకే ఇవ్వడంతో.. ఆయన మళ్లీ వైసీపీ గూటికి చేరారు. ఈ సారి కూడా పోటీ చేసిన ఆదిమూలపు సురేష్.. ముచ్చటగా మూడోసారి విజయం సాధించారు. దీంతో ఈసారి ఎలాగైనా ఎర్రగొండపాలెంలో గెలవాలనే లక్ష్యంతో ఉన్న చంద్రబాబు… అక్కడ ఎరిక్షన్ బాబును అభ్యర్థిగా ముందే ప్రకటించారు. అదే సమయంలో సీనియర్ నేత మన్నె రవీంద్రకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగైనా గెలవాలని టార్గెట్ పెట్టినట్లు సమాచారం.

ఇక గిద్దలూరు నియోజకవర్గం కూడా సేమ్ సీన్. 2009లో అక్కడ ప్రజారాజ్యం పార్టీ తరఫున తొలిసారి పోటీ చేసిన అన్నా రాంబాబు విజయం సాధించారు. ఆయన చివరి నిమిషంలో టీడీపీలో చేరడంతో… 2014 ఎన్నికల్లో కూడా టీడీపీ తరఫున పోటీ చేశారు. కానీ వైసీపీ అభ్యర్థి ముత్తముల అశోక్ రెడ్డి చేతిలో రాంబాబు ఓడారు. రెండేళ్ల పాటు వైసీపీలోనే కొనసాగిన అశోక్ రెడ్డి… అనూహ్యంగా టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో తనకు టికెట్ లేదని గుర్తించిన రాంబాబు… వైసీపీలో చేరారు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన అన్నా రాంబాబు… ఏకంగా 80 వేల పై చిలుకు ఓట్లతో రికార్డు మెజారిటీ సాధించారు. గిద్దలూరులో కూడా టీడీపీ వరుసగా మూడుసార్లు ఓడిపోయింది. దీంతో ఏడాది ముందు నుంచే గిద్దలూరుపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు చంద్రబాబు. భారీ రోడ్ షో నిర్వహించారు. నియోజకవర్గం నేతలతో రివ్యూలు నిర్వహిస్తున్నారు. టీడీపీ తరఫున అశోక్ రెడ్డి దాదాపు ఖాయమంటున్నారు. జనసేనతో పొత్తు కుదిరితే… ఆ సీటు వారికి కేటాయించేందుకు కూడా రెడీ అంటున్నారు చంద్రబాబు.

ఇక శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో జనరల్‌గా ఉన్న రాజాం… 2009 నుంచి ఎస్సీగా మారింది. అప్పటి వరకు కళా వెంకట్రావు పెట్టని కోటగా ఉన్న రాజాం నియోజకవర్గం ఆ తర్వాత నుంచి మారిపోయింది. 2009లో టీడీపీ తరఫున కావలి ప్రతిభా భారతి పోటీ చేయగా… కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి కోండ్రు మురళీ పోటీ చేసి గెలిచారు. ఆయన కిరణ్ సర్కార్‌లో మంత్రిగా కూడా పని చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రతిభా భారతి, వైసీపీ తరఫున కంబాల జోగులు ముఖాముఖి తలపడినప్పటికీ… ఓటర్లు జోగులుకు జై కొట్టారు. ఇక 2019లో మాత్రం కోండ్రు మురళీ సైకిల్ పార్టీ తరఫున పోటీ చేశారు. కానీ మూడోసారి కూడా జోగులు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో రాజాం నియోజకవర్గం టీడీపీకి అందని ద్రాక్షాగానే మిగిలిపోయింది. రాజాం ఓటమికి ప్రధానంగా గ్రూప్ రాజకీయాలని గుర్తించిన చంద్రబాబు… సీనియర్ నేతలు కళా వెంకట్రావు, ప్రతిభా భారతిలతో ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలుస్తోంది. గెలవకపోతే కఠిన చర్యలుంటాయని కూడా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.