వెస్ట్‌లో తమ్ముళ్ళ కుమ్ములాట..మళ్ళీ వైసీపీ వశమే.!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒకప్పుడు టి‌డి‌పి కంచుకోట..కానీ వైసీపీ కంచుకోటగా మారిపోయింది. గత ఎన్నికల్లో జిల్లాలో 15 సీట్లు ఉంటే వైసీపీ 13, టి‌డి‌పి 2 సీట్లు గెలుచుకుంది. అయితే ఈ సారి కూడా వైసీపీ హవా నడిచేలా ఉంది. టి‌డి‌పి-జనసేన విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ ఆధిక్యం ఖాయం. ఒకవేళ పొత్తు ఉంటే వైసీపీ గట్టి పోటీ ఎదురుకునే ఛాన్స్ ఉంది.

అయితే టి‌డి‌పి కొన్ని సీట్లలో, జనసేన కొన్ని సీట్లలో బలపడింది. కాకపోతే టి‌డి‌పిలో ఆధిపత్య పోరు ఎక్కువ ఉంది. ముఖ్యంగా రిజర్వ్ సీట్లలో రచ్చ ఎక్కువ నడుస్తుంది. చింతలపూడి, కొవ్వూరు, గోపాలాపురం ఎస్సీ సీట్లు, పోలవరం ఎస్టీ సీటు. ఈ నాలుగు సీట్లలో టి‌డి‌పికి అభ్యర్ధులు ఎవరనేది క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో ఈ నాలుగు సీట్లలో వైసీపీ గెలిచింది. ఇప్పటికీ అక్కడ వైసీపీకే ఆధిక్యం ఉంది. ఎందుకంటే టి‌డి‌పిలో సరైన నాయకుడు లేరు. అయితే గోపాలాపురంలో ఇంచార్జ్ గా మద్దిపాటి వెంకటరాజు ఉన్నారు..కానీ ఈయనకు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, జెడ్పీ మాజీ ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు సపోర్ట్ చేయడంలేదు.

అలాగే కొవ్వూరు సీటు కోసం మాజీ మంత్రి కే‌ఎస్ జవహర్ ట్రై చేస్తున్నారు. కానీ ఈయనకు టి‌డి‌పిలోని కమ్మ వర్గం సపోర్ట్ ఇవ్వడం లేదు. అటు చింతలపూడి సీటులో రచ్చ ఎక్కువ ఉంది. ఈ సీటు కోసం చాలామంది టి‌డి‌పి నేతలు పోటీ పడుతున్నారు. ఒకరికి సీటు దక్కితే మరొకరు ఓడించేలా ఉన్నారు.

పోలవరం విషయానికొస్తే ఇక్కడ బొరగం శ్రీనివాసరావు, మోడియం శ్రీనివాసరావుల మధ్య పోరు నడుస్తుంది. ఇద్దరు సీటు కోసం పోటీ పడుతున్నారు. ఒకరికి సీటు ఇస్తే..మరొకరు ఓడించడానికి పనిచేసేలా ఉన్నారు.ఇలా నాలుగు సీట్లలో టి‌డి‌పి పరిస్తితి దారుణంగా ఉంది.