గిద్దలూరు వైసీపీలో ఫుల్ క్లారిటీ… మళ్లీ ఆయనే పోటీ….!

ప్రకాశం జిల్లా గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి 90 వేలకు పైగా మెజారిటీ రాగా… ఆయన తర్వాత స్థానంలో పార్టీ సీనియర్లను కాదని… గిద్దలూరు నియోజకవర్గం నుంచి అన్నా రాంబాబు నిలిచారు. ఏకంగా 81 వేల ఓట్ల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన నేతల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు అన్నా రాంబాబు. అయితే గిద్దలూరు నియోజకవర్గం వైసీపీలో గ్రూప్ తగాదాలు ఎక్కువగా ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన అన్నా రాంబాబును ఈసారి పక్కకు తప్పించాలని స్థానిక రెడ్డి, బలిజ సామాజిక వర్గానికి నేతలు గ్రూప్ రాజకీయాలకు తెరలేపారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అన్నా రాంబాబుపైన ఇప్పటికే అధిష్ఠానానికి కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు కూడా.

అటు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సైతం గ్రూప్ రాజకీయాలపై బహిరంగంగానే ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను, తన కుటుంబాన్ని, తన సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని… ఇలా ఎంతకాలం భరించాలో తనకు అర్థం కావడం లేదన్నారు. చివరికి పార్టీలో కొందరు నేతల పేర్లను బహిరంగంగానే ప్రస్తావిస్తూ… రాజకీయాల్లో కొనసాగాలా వద్దా అనేది తేల్చుకోలేక పోతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు అన్నా రాంబాబు. ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశాల్లో సైతం రాంబాబు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇక భరించే ఓపిక తనకు లేదన్నారు. ఒక దశలో రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయే దిశగా ఆలోచిస్తున్నట్లు కూడా రాంబాబు వ్యాఖ్యానించారు.

అయితే తాజాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా గిద్దలూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అభిమానులతో కలిసి పుట్టినరోజు జరుపుకున్న అన్నా రాంబాబు… రాబోయే ఎన్నికల్లో తానే మళ్లీ గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు స్వయంగా హామీ ఇచ్చారని… రాబోయే ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు అన్నా రాంబాబు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో కూడా తాను బంపర్ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు టికెట్ రాకుండా చాలా మంది కుట్రలు చేశారని… కానీ జగన్ మాత్రం తననే అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు హామీ ఇచ్చారని రాంబాబు వెల్లడించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో అన్నా రాంబాబు పోటీ చేయడం దాదాపు ఖాయమే అంటున్నారు వైసీపీ నేతలు.