గన్నవరం పంచాయితీ..యార్లగడ్డకు సీటు దక్కనట్లే.!

ఏపీలో పలు నియోజకవర్గాల్లో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా సీట్ల విషయంలో నేతల మధ్య పోటీ నెలకొంది. ఇదే సమయంలో గన్నవరం సీటు విషయంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు మధ్య పంచాయితీ ఎప్పటినుంచో నడుస్తోంది. గత ఎన్నికల్లో వంశీ టి‌డి‌పి నుంచి, యార్లగడ్డ వైసీపీ నుంచి పోటీ చేశారు. వెయ్యి ఓట్ల మెజారిటీతో వంశీ గెలిచారు.

తర్వాత వంశీ టి‌డి‌పిని వదిలి వైసీపీలోకి వచ్చారు. అక్కడ నుంచి యార్లగడ్డ, వంశీలకు పొసగడం లేదు. పలుమార్లు జగన్ వారిని కలపాలని చూశారు గాని సెట్ కాలేదు. ఇదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ సీటు వంశీకి ఫిక్స్ అయింది. దీంతో యార్లగడ్డ అసంతృప్తిగానే ఉన్నారు. యార్లగడ్డకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి కూడా చూశారు..కానీ యార్లగడ్డ ఎమ్మెల్సీ తిరస్కరించారు. గన్నవరంలోనే పోటీ చేస్తానని అంటున్నారు. తాజాగా తన అనుచరులతో ఆత్మీయ సమావేశం పెట్టి..సీటు తనకు ఇవ్వాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

జగన్‌ సభకు కళ్యాణమండపం కూడా ఇవ్వనీయని వ్యక్తికి, జగన్‌ను, భారతిని తిట్టిన వ్యక్తికి ఇన్‌చార్జి అప్పగించారని, దీనిపై అడిగినపుడు టీడీపీకి ప్రతిపక్ష హోదా తీసేయటం కోసమే అన్నారని, వాస్తవంగా చంద్రబాబు ప్రతిపక్ష హోదా పోలేదని, వైసీపీ నేతల హోదాలన్నీ పోయాయని, పైగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై కేసులు మాఫీ అయితే..గన్నవరంలో మాత్రం అసలైన వైసీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు అలాగే ఉన్నాయని యార్లగడ్డ చెప్పుకొచ్చారు.

గన్నవరంలోనే ఉంటానని, 2024లో గన్నవరం నుంచే పోటీ చేస్తానని, ఇక్కడి ప్రజలకు సేవ చేస్తానని, “ ఇప్పటికీ అభ్యర్థిస్తున్నాను అన్నా.. నాకు సీటివ్వు. ఒకవేళ సీటు రాకపోతే నా రాజకీయ భవిష్యత్తును గన్నవరం నియోజకవర్గ ప్రజలే నిర్ణయిస్తారు” అని జగన్‌ని యార్లగడ్డ కోరారు. అయితే వైసీపీ సీటు యార్లగడ్డకు దక్కే ఛాన్స్ లేదు. అది వంశీకి ఫిక్స్. దీంతో యార్లగడ్డ టి‌డి‌పిలోకి వెళ్ళి పోటీ చేసే ఛాన్స్ ఉంది. త్వరలోనే ఆయన టి‌డి‌పిలోకి చేరే ఛాన్స్ ఉంది.