బాబుకు జనాదరణ కరువు..అక్కడ నుంచే డౌట్.!

బాదుడే బాదుడు అంటూ గత రెండేళ్ల క్రితం..జగన్ సర్కార్ పన్నుల బాదుడుపై టి‌డి‌పి అధినేత చంద్రబాబు పోరాటం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. టి‌డి‌పి నేతలని జనంలోకి పంపారు. ఏ విధంగా ప్రభుత్వం పన్నుల బాదుడుకు దిగిందో ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేశారు. ఇక చంద్రబాబు సైతం ప్రజల్లో తిరిగారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో పెద్ద ఎత్తున ప్రజా స్పందన వచ్చింది.

ఈ స్పందన ఎవరూ ఊహించలేదు. ఇక్కడ నుంచి ప్రజల్లో మార్పు మొదలైందని భావించారు. ఆ తర్వాత ఉమ్మడి  పశ్చిమ గోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పుడు కూడా ప్రజా స్పందన బాగుంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు సభలో భారీగా తొక్కిసలాట జరగడం దాదాపు 8 మందిపైనే మరణించారు. ఆ తర్వాత గుంటూరులో ఓ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. ఈ పరిణామాల తర్వాత బాబు రోడ్ షోలకు జనాదరణ కరువైంది.

ఆ మధ్య మచిలీపట్నం, గుడివాడ సభలు బోసిగా అయ్యాయి. ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇప్పుడు కోనసీమ జిల్లాలో బాబు పర్యటిస్తున్నారు. మండపేట, కొత్తపేటల్లో పర్యటించారు. ఈ రెండు చోట్ల అనుకున్న మేర జనం కనిపించలేదు. పట్టుమని ఓ 5 వేల మంది కూడా రోడ్డు మీద లేరు. కాకపోతే కెమెరాలతో ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నారు.

దీని బట్టి చూస్తే బాబుకు జనాదరణ పెద్దగా రావడం లేదని తెలుస్తోంది. కానీ పవన్‌కు ప్రజాదరణ పెద్ద ఎత్తున వస్తుంది. అటు జగన్ సభలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి.