హాలీవుడ్ నటికి తెలుగు నేర్పిన అలియా భట్.. వీడియో చూస్తే ప‌డి ప‌డి నువ్వుకోవాల్సిందే!

బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భ‌ట్ రీసెంట్ గా `రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ ల‌భించింది. ఇదిలా ఉంటే.. అలియా భ‌ట్ న‌టించిన హ‌లీవుడ్ డెబ్యూ మూవీ `హార్ట్ ఆఫ్ స్టోన్` రిలీజ్ కు రెడీ అయింది.

టామ్ హార్పర్ దర్శకత్వం వ‌హించిన ఈ అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆగస్ట్ 11న నేరుగా నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదల కాబోతోంది. ప్ర‌స్తుతం చిత్ర టీమ్ తో క‌లిసి అలియా భ‌ట్ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటోంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో అలియా భ‌ట్‌.. హాలీవుడ్ నటి గాల్ గాడోట్ కి తెలుగు ఎలా మాట్లాడాలో నేర్పింది.

అలియా భ‌ట్ `అందరికీ నమస్కారం` అంటూ గాల్ కి తెలుగు నేర్పించే ప్రయత్నం చేసింది. మీ అందరికీ నా ముద్దులు అని చెప్ప‌మంది. గాల్ కష్టపడి ఈ లైన్లు చెప్పే ప్రయత్నం చేసింది. న‌వ్వులు పూయిస్తున్న ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొడుతోంది. ముఖ్యంగా తెలుగు వారిని ఈ వీడియో బాగా అల‌రిస్తోంది. నిజానికి అలియా భ‌ట్ కు తెలుగు రాదు. కానీ, `ఆర్ఆర్ఆర్‌` సినిమా షూటింగ్ టైమ్ లో తెలుగు భాష‌పై కొంచెం ప‌ట్టు సాధించింది. ఇప్పుడు త‌న‌కు కొంచెం కొంచెం వ‌చ్చిన తెలుగునే అలియా ఏకంగా హాలీవుడ్ న‌టికి నేర్పే ప్ర‌య‌త్నం చేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.