సాయిరెడ్డి ఎటాకింగ్ పాలిటిక్స్..ఆ మూడు జిల్లాల్లో కలిసొస్తుందా?

వైసీపీలో విజయసాయిరెడ్డి పాత్ర ఎలాంటిదో చెప్పాల్సిన పని లేదు. పార్టీ మొదట నుంచి ఆయన పనిచేస్తూ వస్తున్నారు. అన్నిటిలోనూ జగన్ వెంట నడుస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ మంచి విజయాన్ని అందుకోవడానికి సాయిరెడ్డి కష్టం కూడా ఉంది. ఎందుకంటే 2014లో ఉత్తరాంధ్రలో వైసీపీ దారుణంగా ఓడింది. పైగా విజయమ్మ విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.

అప్పుడు నుంచి ఉత్తరాంధ్రలో వైసీపీ సత్తా చాటడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బలమైన టి‌డి‌పికి చెక్ పెట్టి అనూహ్యంగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో వైసీపీకి లీడ్ తెచ్చారు. మొత్తం 34 సీట్లు ఉంటే వైసీపీ 28 సీట్లు గెలుచుకుంది. ఈ విజయంలో సాయిరెడ్డి కష్టం ఎక్కువే ఉంది. అలాగే విశాఖ కార్పొరేషన్ వైసీపీ వశమయ్యేలా చేశారు. కానీ ఎందుకో తర్వాత ఆయన్ని సైడ్ చేశారు. ఉత్తరాంధ్ర బాధ్యతలని వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. అలాగే సాయిరెడ్డి యాక్టివ్ గా పాలిటిక్స్ చేయడం మానేశారు.

అసలు ట్విట్టర్ లో చంద్రబాబుపై విరుచుకుపడే సాయిరెడ్డి..తారకరత్న మరణం తర్వాత వెనక్కి తగ్గారు. కానీ ఇటీవల ఆయన అనూహ్యంగా దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు, లోకేశ్, పవన్, పుంరదేశ్వరి ఇలా ఎవరిని వదలకుండా కౌంటర్లు ఇస్తున్నారు. పైగా ఆయనకు తూర్పు రాయలసీమ బాధ్యతలు అప్పగించేందుకు జగన్ సిద్ధమయ్యారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా కో ఆర్డినేటర్ గా బాలినేని శ్రీనివాస్ రెడ్డి తప్పుకోవడంతో ఆయన స్థానంలో సాయిరెడ్డిని పెడుతున్నారు.

ఎలాగో సాయిరెడ్డి సొంత జిల్లా నెల్లూరు. దీంతో తన ప్రాంతంలో మళ్ళీ వైసీపీకి భారీ విజయం అందించే దిశగా సాయిరెడ్డి పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. మళ్ళీ ఈస్ట్ సీమలో వైసీపీ హవా కొనసాగనుంది.