కాంగ్రెస్‌లోకి వలసల జోరు..కర్నాటక ఫార్ములాతో దూకుడు.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతుంది. బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిలకు చెందిన కీలక నేతలు వరుసపెట్టి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇదే క్రమంలో తాజాగా మరికొందరు కాంగ్రెస్ లోకి వస్తున్నారు. గద్వాల జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత కాంగ్రెస్ లో చేరుతున్నారు. అటు తీగల కృష్ణారెడ్డి తాజాగా రేవంత్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. అలాగే ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఆయన తనయుడు, ఇంకా పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారు.

అయితే ఇలా వలసల జోరు కొనసాగుతుండగానే..కాంగ్రెస్ సీనియర్లు ఏకం అయ్యారు. ఇంతకాలం ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. అలాగే వారి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఈ క్రమంలో నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని డిసైడ్ అయ్యారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏ విధంగా కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో..అదే మాదిరిగా తెలంగాణ సీనియర్లు కలిసికట్టుగా పనిచేస్తున్నారు.

తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, జూపల్లి కృష్ణారావు, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి  ఇలా పలువురు సీనియర్లు కలిసి..పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్ళేందుకు కృషి చేస్తున్నారు.

అలాగే నేతలు విడతల వారీగా బస్సు యాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ నేతలు ఇలా ఐక్యంగా పనిచేస్తే..ఆ పార్టీకే ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ నెల30న కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీని ఆహ్వానించి భారీ సభ నిర్వహించనున్నారు. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ మంచి ఊపు మీద ఉంది.