రాహుల్‌తో హస్తం జోరు..కేసీఆర్‌ని నిలువరిస్తారా?

మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం వచ్చింది. చాలా రోజుల తర్వాత ఆ పార్టీలో జోరు పెరిగింది. ఇటీవల కర్నాటక ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా అనూహ్యంగా రేసులోకి వచ్చిన ఆ పార్టీకి కొత్త చేరికలు భారీ ప్లస్ అవుతున్నాయి. ఇదే క్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వారు…కాంగ్రెస్ లోకి రావడంతో సీన్ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చేలా ఖమ్మంకు రాహుల్ గాంధీ వచ్చారు.

ఖమ్మంలో జరిగిన సభలో భారీగా జనం వచ్చారు..రాహుల్ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ లో చేరారు. ఇంకా భారీ చేరికలు జరిగాయి. ఇదే క్రమంలో రాహుల్..ఇటు కే‌సి‌ఆర్ ప్రభుత్వం, అటు మోదీ ప్రభుత్వం టార్గెట్ గా విరుచుకుపడ్డారు. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని,  మిషన్‌ కాకతీయ వేల కోట్ల కుంభకోణమని, ధరణి పోర్టల్‌తో ముఖ్యమంత్రి భూములన్నీ దోచుకుంటున్నాడని,  లిక్కర్‌ స్కాంతో పాటు ఇతర కుంభకోణాలన్నీ కేంద్ర ఏజెన్సీలకు తెలుసని, కేసీఆర్‌ రిమోట్‌ కంట్రోల్‌ మోదీ చేతుల్లో ఉందని,  అందుకే పార్లమెంటులో బీజేపీకి మద్దతు పలుకుతున్నారని, బీఆర్‌ఎస్‌ అంటే.. బీజేపీ రిష్తేదార్‌ (బంధుత్వ) సమితి అని మాట్లాడారు.

ఇక తెలంగాణలో బీజేపీ పని అయిపోయిందని, ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బీ టీమ్‌ అయిన బీఆర్‌ఎస్‌తోనే కాంగ్రెస్‌కు పోటీ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పెన్షన్ పెంపుపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పెన్షన్‌ను రూ.4వేలకు పెంచుతామని రాహుల్ హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, ఎయిడ్స్‌ బాదితులు, డయాలసిస్‌ రోగులకు రూ.4వేల చొప్పున పెన్షన్‌ అందిస్తామని తెలిపారు.

అయితే ఇలా రాహుల్ గాంధీ సభ భారీగా సక్సెస్ అవ్వడం, ఆ పార్టీలో వలసలతో భారీ జోష్ వచ్చింది. ఈ జోష్ తో కే‌సి‌ఆర్‌ని గద్దె దించాలని చూస్తున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.