మెగాస్టార్ చిరంజీవి ఇటీవలె `భోళా శంకర్` మూవీని కంప్లీట్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కాబోతోంది. ఈ మూవీకి డబ్బింగ్ కూడా చెప్పేసిన చిరంజీవి.. రెండో రోజుల క్రితం భార్య సురేఖతో కలిసి వెకేషన్ కోసం ఆమెరికా వెళ్లారు.
ఆమెరికా నుంచి వచ్చిన తర్వాత `బంగార్రాజు` ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి ఓ మూవీ చేయనున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. మలయాళ హిట్ మూవీ `బ్రో డ్యాడీ`కి ఇది రీమేక్ అని కూడా కొందరు అంటున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఈ సినిమాను నిర్మించబోతోంది. అయితే ఇందులో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కీలక పాత్ర పోషిస్తున్నాడని.. అతడు చిరంజీవి కొడుకు పాత్రలో అలరించబోతున్నాడని ప్రచారం జరిగింది.
ఈ సినిమా కోసం సిద్ధు ఏకంగా 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ, చివరిన నిమిషంలో చిరంజీవికి టిల్లుగాడు హ్యాండిచ్చాడు. మొదట చిరంజీవి సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన సిద్ధు జొన్నలగడ్డ.. తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. హీరోగా ఎదుగుతున్న క్రమంలో సపోర్టింగ్ రోల్ చేయడం కరెక్ట్ కాదని భావించి సిద్ధు చిరంజీవి సినిమాలో నుంచి సైడ్ అయ్యాడని ఓ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. దీంతో కొందరు మెగా ఫ్యాన్స్ సిద్ధు జొన్నలగడ్డను టార్గెట్ తో చేస్తూ.. అతడిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక సిద్ధు తప్పుకోవడంతో డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ మరొక యంగ్ హీరోను పట్టుకునే పనిలో పడ్డారని టాక్.