సీతక్క సీఎం అంటున్న రేవంత్..సీనియర్లు గుస్సా.!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వర్గం…సీనియర్ల వర్గానికి పెద్దగా పడని విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు రచ్చ కూడా జరిగింది. అయితే ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ బలపడటంతో కాస్త విభేదాలు ఆగాయి. అయినా సరే లోలోపల రేవంత్ అంటే సీనియర్లు రగులుతూనే ఉన్నారు. ఇలాంటి పరిస్తితుల్లో తాజాగా రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్..సీనియర్లకు ఆగ్రహం తెప్పించిందని చెప్పవచ్చు.

తాజాగా తానా సభలకు రేవంత్ అమెరికా వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక సీతక్క కూడా అమెరికాలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఎన్‌ఆర్‌ఐలతో జరిగిన ఓ సమావేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గిరిజనులకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డిని అక్కడ ఎన్‌ఆర్‌ఐలు కోరారు. ప్రత్యేకంగా సీతక్కని డిప్యూటీ సి‌ఎంని చేయాలని అన్నారు.

దీనిపై రేవంత్ స్పందిస్తూ.. సీతక్కకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా!? అని అడిగారు కదా? ఆ సందర్భం వస్తే అక్కను సీఎంగా కూడా చేయవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. పేదలు, దళితులు, ఆదివాసీల అభ్యున్నతి కోసం కాంగ్రెస్‌ ఒక పాలసీతో ముందుకు సాగుతోందన్నారు. ఇక ఇలా రేవంత్ అనడంపై సీనియర్లు గుస్సా అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సి‌ఎం రేసులో చాలామంది నేతలు ఉన్నారు. అలాంటి తరుణంలో తన వర్గంలో ఉండే సీతక్కనే రేవంత్ హైలైట్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.

అయితే కాంగ్రెస్ లో దళితులు, గిరిజనులకు పెద్ద పీఠ వేస్తుందని చెప్పడంలో భాగంగానే రేవంత్ అలా ఉదాహరణగా చెప్పారని, కానీ ఏ నిర్ణయమైన కాంగ్రెస్ అధిష్టానమే తీసుకుంటుందని రేవంత్ వర్గం అంటుంది. మొత్తానికి ఇంకా ఎన్నికలు అవ్వకముందే కాంగ్రెస్ లో సి‌ఎం సీటుపై పంచాయితీ నడుస్తుంది.