రాయదుర్గం వైసీపీలో రచ్చ..ఎమ్మెల్యేకు సెగలు.!

ఏపీలో అధికార వైసీపీలో ఎక్కడకక్కడ ఆధిపత్య పోరు తారస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. సొంత పార్టీ నేతలే ఆధిపత్య పోరుకు దిగుతున్నారు. ఒకరినొకరు చెక్ పెట్టుకునే దిశగా వెళుతున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సెగలు ఎక్కువ ఉన్నాయి. కొందరు ఎమ్మెల్యేలని సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో సీటు ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. సీటు ఇస్తే టి‌డి‌పి కాదు..తామే ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.

ఇదే సమయంలో తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీలో ముసలం మొదలైంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలే పావులు కదుపుతున్నారు. ఇప్పటిటికే అక్కడ కీలక వైసీపీ నేత మెట్టు గోవిందా రెడ్డి వర్గం..ఎమ్మెల్యే కాపుకు యాంటీగా గళం విప్పుతున్నారు. ఇక కాపు, మెట్టు వర్గీయులు జిల్లా ఇనచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కాపు రామచంద్రారెడ్డికి ఈ సారి టిక్కెట్‌ ఇవ్వరని, మెట్టు గోవిందరెడ్డికే అవకాశం ఇస్తారని అధికార పార్టీలో ప్రచారం జరుగుతోంది.

అటు కాపు వర్గం మాత్రం..తమ ఎమ్మెల్యేకే సీటు అని అందులో ఎలాంటి డౌట్ లేదని అంటున్నారు. ఇలా ఎవరికి వారు సీటు కోసం పోటీ పడుతున్నారు. కాపు రామచంద్రారెడ్డి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, పార్టీకి తీరని నష్టం కలిగించాడని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. అలాగే నియోజకవర్గంలో కాపు కుటుంబం పెత్తనం ఎక్కువైందని వైసీపీలో కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు.

ఈ పరిణామాలు రాయదుర్గం వైసీపీకి నష్టం చేసేలా ఉన్నాయి. ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే పర్లేదు..లేదంటే వైసీపీకే ఎదురుదెబ్బ. రాయదుర్గం సీటు ఒకరికి ఇస్తే మరొక వర్గం సహకరించడం జరిగే పనికాదు..దీని వల్ల వైసీపీకే నష్టం.