యాత్ర-2కి అంతా సిద్ధం.. వైఎస్ జగన్ అభిమానులు ఖుషీ..

రాజకీయ ప్రయోజనాలను పొందడంలో ప్రచారం అనేది కీలకం. సాధారణంగా ప్రకటనలు, పోస్టర్లు ఇంకా మేనిఫెస్టో తదితర మార్గాల్లో రాజకీయ నాయకులు తమను తాము ప్రమోట్‌ చేసుకుంటుంటారు. అయితే ఈ మధ్య ఎలక్షన్ల సమయంలో సినిమాలు కూడా ప్రచార సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రజల సినిమాలు చూసి తాము చేసిన మంచి ఏంటో తెలుసుకుంటారని కొందరు పొలిటికల్ బయోపిక్‌లు తీసి వదులుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ తరహా సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. గత ఎన్నికల ముందు కూడా పొలిటికల్ ఎజెండాతో కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు రిలీజ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. వాటిలో యాత్ర 2 అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర నేపథ్యంతో ‘యాత్ర’ మూవీ గతంలో రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు మహి వి. రాఘవ్, మమ్ముట్టి కలిసి తీసిన ఈ మూవీ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో దీనికి ఒక సీక్వెల్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా త్వరలోనే లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, యాత్ర 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్స్‌ ఆల్రెడీ అయిపోడానికి వచ్చాయి. తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ పడిన బాధలు, ఆయన చేపట్టిన పాదయాత్ర చుట్టూ యాత్ర 2 సినిమా సాగుతుందని సమాచారం. వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జులై 8న ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నారని సంబంధిత వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రను మమ్ముట్టి చాలా అద్భుతంగా పోషించారు. జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళ హీరో జీవా పోషించనున్నాడట. ఈ మూవీ సరిగ్గా ఎన్నికలకు ముందు రిలీజ్ కానుందని తెలుస్తోంది.