మొత్తానికి నాలుగేళ్ల తర్వాత నెల్లూరు సిటీ బాధ్యతలని మాజీ మంత్రి నారాయణ తీసుకున్నారు. దీంతో నెల్లూరు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇప్పటికే అక్కడ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపుకు వచ్చారు. దీంతో సమీకరణాలు మారిపోయాయి. అదే సమయంలో ఇంతకాలం రాజకీయంగా యాక్టివ్ గా లేని నారాయణ సైతం యాక్టివ్ అయ్యారు. నారా లోకేష్ పాదయాత్ర నెల్లూరులో కొనసాగుతుంది..దీంతో పాదయాత్రకు మరింత ఊపు తెచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.
ఇక నెల్లూరు రూరల్ లో లోకేష్ పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీసుకోగా, సిటీ బాధ్యతలు నారాయణ తీసుకున్నారు. ఇదే క్రమంలో ఇంతకాలం సిటీ బాధ్యతలు చూసుకుంటున్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని పక్కన పెట్టి..నారాయణని ఇంచార్జ్ గా పెట్టారు. నెక్స్ట్ ఎన్నికల్లో నారాయణని బరిలో దించడం కోసం ఇప్పటినుంచే మార్పులు చేశారు. ఇక కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి భవిష్యత్ లో ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
దీంతో నారాయణకు నెల్లూరు సిటీలో లైన్ క్లియర్ అయింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే దిశగా ఆయన ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం 2 వేల ఓట్ల తేడాతో నారాయణ..అనిల్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ సీన్ మారింది. అనిల్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. అసలు సీటు దక్కుతుందో లేదో తెలియని పరిస్తితి. సీటు వచ్చిన సొంత పార్టీ వాళ్ళే ఓడించేలా ఉన్నారు.
ఇటు నారాయణపై ఓడిన సానుభూతి ఉంది. సిటీ ప్రజల్లో కూడా మార్పు కనిపిస్తుంది. ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో నారాయణ ఉన్నారు. చూడాలి మరి ఈ సారి అనిల్‌కు నారాయణ చెక్ పెట్టగలరో లేదో.