గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి కాబోతోంది. సోషల్ మీడియాలో నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను పంచుకునే ఇలియానా.. ఇంతవరకు తన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది మాత్రం చెప్పడం లేదు. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కొన్ని పిక్స్ ను షేర్ చేసింది.
అయితే వాటిలో అతగాడి రూపం మాత్రం కనిపించలేదు. ప్రియుడిని చూపించకుండా దాగుడుమూతలు ఆడుతున్న ఇలియానా.. తాజాగా తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా ప్రెగ్నెన్సీకి సంబంధించి అనేక విషయాలపై ఓపెన్ అయింది. ప్రెగ్నెన్సీ టైమ్ లో బరువు పెరగడంపై ఆందోళన చెందుతున్నారా? అని ప్రశ్నించగా.. ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
`అందరూ అదే అడుగుతున్నారు. ఈ ప్రశ్న మొదట్లో నన్ను చాలా కలవరపెట్టింది. కానీ గత కొన్ని నెలలుగా నా శరీరంలో వస్తున్న మార్పులను అంగీకరించడం నేర్చుకున్నాను. ఇది అద్భుతమైన జర్నీ. నా చుట్టూ నన్ను ప్రేమించే వాళ్లున్నారు. నా లోపల నా బేబీ ఉంది. కాబట్టి బరువు అనేది పెద్ద విషయం కాదు. ఇన్ని కిలోలు మాత్రమే పెరగాలనే నిబంధనలు పెట్టుకోలేదు. మీ శరీరం మాట వినండి. మీకు నచ్చింది చేయండి` అంటూ ఇలియానా పేర్కొంది. ఇక మొట్టమొదటి సారి తన బేబీ హార్ట్ బీట్ విన్నప్పుడు అనుభవించిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని.. కన్నీళ్లు, ఆనందం అన్ని భావోద్వేగాలు ఒకేసారి వచ్చేశాయని ఇలియానా పేర్కొంది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.