ఖమ్మంకు రాహుల్..కాంగ్రెస్‌లో రచ్చ మొదలు.!

అంతా బాగుదనుకునే సమయంలో ఏదొక చిచ్చు చెలరేగడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా మారిపోయింది. ఆ పార్టీ ఇప్పుడుప్పుడే సెట్ అవుతుంది. భారీ చేరికలతో మంచి జోష్ నెలకొంది. ఇంకా బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టే దిశగా కాంగ్రెస్ ముందుకెళుతుంది. తాజాగా రాహుల్ గాంధీతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు..పొంగులేటి, జూపల్లిలతో పాటు 35 మంది నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. దీంతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది.

ఇక జులై 2 ఆదివారం ఖమ్మంలో భారీ సభ జరగనుంది. రాహుల్ గాంధీ సభకు రానున్నారు. పొంగులేటి, జూపల్లిలతో పాటు కాంగ్రెస్ లోకి భారీ చేరికలు కొనసాగనున్నాయి. ఇక దాదాపు 3-4 లక్షల మందితో భారీ సభ పొంగులేటి ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అంతా బాగుందనుకునే సమయంలో కాంగ్రెస్ లో అంతర్గత పోరు మళ్ళీ మొదలైంది. ఇటీవల ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతున్నారని ప్రచారం వచ్చింది. ఇదంతా రేవంత్ వర్గం చేయిస్తుందని ఉత్తమ్ సీరియస్ గా ఉన్నారని తెలిసింది. దీనిపై అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఇక సొంత పార్టీ వాళ్ళే దుష్ప్రచారాలు చేసే దరిద్రం దాపరించిందని, ఇంత బతుకు బ్రతికి పార్టీలో ఇలాంటి పరిస్థితులు చూస్తానని అనుకోలేదని,  పార్టీలో నాలుగేళ్ళ నుంచి తనపై ప్రచారం జరుగుతోందని… పార్టీ కోసం ఎంత చేసినా తనను ప్రశ్నిస్తున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  ఉత్తమ్ పార్టీ మార్పుపై ప్రచారం ఎందుకు జరుగుతుందో తెలియదని అన్నారు. ఆయన పార్టీ మారడం జరిగే పని కాదని అంటున్నారు. కాంగ్రెస్‌లో ఎందుకు ఈ పరిస్థితి ఉందో అర్థం కావడం లేదన్నారు. రాహుల్ గాంధీకి అన్ని విషయాలు నిశితంగా వివరిస్తానని చెప్పుకొచ్చారు. మొత్తానికి పార్టీలో అంతర్గత చిచ్చు మళ్ళీ చెలరేగింది.