తెలుగు సినీ రంగంలో సీనియర్ ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు. ముఖ్యంగా పౌరాణిక సినిమాలకు ఆయన పెట్టింది పేరు. రాముడు, కృష్ణుడు, కర్ణుడు ఇలా ఎన్నో పాత్రలను ఆయన అవలీలగా పోషించారు. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారనే తెలుగు ప్రజల ఊహకు వెంటనే ఆయన రూపమే గుర్తు వస్తుంది. ఆయన తనయుడు బాలకృష్ణ కూడా సాధారణ సినిమాలతో పాటు పౌరాణిక సినిమాలను కూడా అలవోకగా చేస్తారు.
భారీ డైలాగులను చాలా సులభంగా పలుకుతారు. సీనియర్ ఎన్టీఆర్‌కు మొత్తం 8 మంది కొడుకులు, నలుగురు కుమార్తెలు సంతానం. అందరిలోనూ బాలకృష్ణ అంటే సీనియర్ ఎన్టీఆర్‌కు చాాలా ఇష్టం. అయితే ఎంతో ఇష్టపడే బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్ హాజరు కాలేదు. నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
సినీ రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా ముఖ్యమంత్రులను మార్చేది. నిలకడ లేని ప్రభుత్వాలు, తెలుగు నేతల పట్ల ఢిల్లీ అధిష్టానానికి చిన్న చూపు వంటివి ఎన్టీఆర్‌ను బాధించాయి. తెలుగు ప్రజల ఆత్మగౌరవమే లక్ష్యంగా ఆయన 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించారు. సినిమా వాళ్లకు రాజకీయాలు ఏం తెలుసులే అని అప్పటి ప్రధాని ఇందిర గాంధీ హేళన చేశారు. దీనికి ఎన్నికల్లోనే ఆయన ధీటైన జవాబిచ్చారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఇక ఎన్నికల సమయంలో ఆయన ప్రచార రథంపై రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేపట్టారు. రథ సారధిగా హరికృష్ణ వ్యవహరించారు. అదే సమయంలో బాలకృష్ణకు వసుంధరతో వివాహం నిశ్చయం అయింది. అయితే ఎన్నికలు సమీపిస్తుండడం, ప్రజల్లోకి వెళ్లాల్సి ఉండడంతో పర్యటనల్లో ఉన్న ఎన్టీఆర్ ఆ సమయంలో బాలకృష్ణ పెళ్లికి హాజరు కాలేదు. ప్రజలే ముఖ్యం అనుకున్న ఆ మహానాయకుడు సొంత కొడుకు పెళ్లిని పక్కన పెట్టారు.