రాజమౌళి `ఆర్ఆర్ఆర్‌`లా నాది ఫేక్ స్టోరీ కాదు.. నిఖిల్ అంత మాట‌న్నాడేంటి?

కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్‌.. ఇప్పుడు `స్పై` యాక్ష‌న్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు సిద్ధం అయ్యాడు. పాపులర్ ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ ఈ మూవీతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తున్నాడు. ఇందులో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్ గా న‌టించింది.

మకరంద్ దేశ్‌పాండే, ఆర్యన్ రాజేశ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్రానికి కే రాజశేఖర్‌ రెడ్డి నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా స్టోరీ కూడా అందిస్తున్నాడు. రీసెంట్ గా బ‌య‌ట‌కు వ‌చ్చిన స్పై టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు.

ఇందులో నేతాజీ కనిపించకుండా పోవడానికి కారణం ఏంటో కనుక్కునే స్పై గా నిఖిల్ నటించాడు. అయితే టీజ‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా నిఖిల్ మీడియాతో ముచ్చ‌టించాడు. ఈ సంద‌ర్భంగా వారు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధానాలు ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే ఓ రిపోర్ట‌ర్ `ఆర్ఆర్ఆర్‌ చిత్రం లో స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరంభీమ్ వంటి వారి పేర్లను వాడుకొని ఫేస్ స్టోరీతో రాజ‌మౌళి సినిమా తీశాడు, మీరు కూడా సుభాష్ చంద్రబోస్ పేరుని వాడుకొని ఫిక్షనల్ సినిమా తీసారా..?` అని ప్ర‌శ్నించాడు. అందుకు నిఖిల్ బ‌దులిస్తూ.. రాజమౌళి `ఆర్ఆర్ఆర్‌`లా నాది ఫేక్ స్టోరీ కాదని తేల్చేశాడు. 1970 వ సంవత్సరం నుండే చంద్రబోస్ గారు కనిపించకుండా పోయినదానికి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయ‌ని.. ఆ ఫైల్స్ ని ఈమధ్యనే డిటాచ్ చేశార‌ని, ఆ ఫైల్స్ ని సంపాదించి ఈ చిత్రాన్ని తెరకెక్కించామ‌ని నిఖిల్ తెలిపాడు. దీంతో నిఖిల్ స్పై ఒక ఫేక్ స్టోరీ కాద‌ని తేలిపోయింది.