టీడీపీలోకి మేకపాటి..లైన్ క్లియర్ అయినట్లేనా..సీటు ఇస్తారా?

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తుంది..ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి క్రాస్ ఓటు వేశారని చెప్పి నలుగురు ఎమ్మెల్యేలని వైసీపీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలని సస్పెండ్ చేశారు. అయితే వీరు పార్టీకి కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇక వీరు టి‌డి‌పిలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూనే వచ్చింది.

అయితే ఎమ్మెల్యే పదవి ఉండటంతో ఎన్నికల సమయంలోనే టి‌డి‌పిలో చేరే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కోటంరెడ్డి, ఆనం టి‌డి‌పిలో చేరడం ఖాయమని తేలింది. తాజాగా మేకపాటి..టి‌డి‌పి సీనియర్ నేత కంభం విజయరామిరెడ్డితో భేటీ కావడం సంచలనం సృష్టించింది. ఎందుకంటే దశాబ్దాల కాలం నుంచి మేకపాటి, కంభం ఫ్యామిలీల మధ్య రాజకీయ వైరం కొనసాగుతుంది. 1985 నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి, కంభంల మధ్య పోరు జరుగుతుంది.

1985లో మేకపాటి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి..కంభంపై గెలిచారు. 1994, 1999 ఎన్నికల్లో కంభం గెలిచారు. ఇక 2004 నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచారు. 2009లో కూడా గెలిచిన ఆయన..2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి గెలిచారు. మళ్ళీ 2014లో ఓడిన ఆయన..2019 ఎన్నికల్లో గెలిచారు. ఇక ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.

ఈ క్రమంలో సీనియర్ నేత కంభంతో భేటీ కావడం నెల్లూరు రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ వచ్చింది. మేకపాటి టి‌డి‌పిలోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందుకే కంభంతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈయన టి‌డి‌పిలోకి వస్తే ఏ సీటు ఇస్తారనేది పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ఉదయగిరిలో టి‌డి‌పి నుంచి బొల్లినేని వెంకట రామారావు ఉన్నారు. మరి ఆయనని కాదని మేకపాటికి సీటు ఇవ్వడం కష్టమే.