చైత‌న్య‌తో విడాకుల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం.. నిహారిక స‌మాధానం ఏంటంటే?

మెగా డాటర్, ప్రముఖ నటి నిహారిక కొణిదెల గత కొద్దిరోజుల నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నిహారిక వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడ్డాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. భర్త చైతన్య జొన్న‌ల‌గ‌డ్డ‌ నుంచి నిహారిక విడాకులు తీసుకునేందుకు సిద్ధమైందంటూ జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 2020లో వీరిద్ద‌రూ పెద్దలు సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

కానీ పెళ్లైన కొన్నాళ్ల‌కే వీరి మధ్య విభేదాలు ఏర్ప‌డ్డాయని.. అవి పెరిగి పెరిగి విడాకుల వరకు వెళ్లాయ‌ని ప్రచారం జరుగుతోంది .ఈ ప్రచారానికి బ‌లాన్ని చేకూరుస్తూ చైతన్య మరియు నిహారిక సోషల్ మీడియా అకౌంట్లో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. అలాగే తమ ఇన్‌స్టాగ్రామ్ లో పెళ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు కలిసి దిగిన ఫిక్స్ ను ఇద్ద‌రూ తొలగించారు. అలాగే చైత‌న్య‌, నిహారిక జంట‌గా క‌నిపించి కూడా చాలా కాలం కావస్తోంది.

అయితే ప్రస్తుతం నిహారిక తాను న‌టించిన `డెడ్ పిక్సెల్స్` వెబ్ సిరీస్‌ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే తాజాగా నిహారిక మీడియాతో ముచ్చటించింది. అయితే నిహారిక న‌టించిన వెబ్ సిరీస్ కంటే ఆమె వైవాహిక జీవితం గురించి తెలుసుకునేందుకే మీడియా ఎక్కువ మ‌క్కువ చూపింది. ఇందులో భాగంగానే చైతన్యతో విడాకుల‌ విషయంపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే నిహారిక మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాట‌వేసింది. భ‌ర్త‌తో విడాకుల వార్త‌ల‌పై ఆమె నోరు విప్ప‌లేదు. అలాగని వాటిని ఖండించనూ లేదు. దీంతో అంద‌రిలోనూ అనుమానాలు మరింత బలపడ్డాయి.

Share post:

Latest